ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట బురుజుల మీది నుండి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం లో ముఖ్యాంశాలు కింది విధంగా ఉన్నాయి:
• ఈ రోజు దేశం సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం తో నిండి ఉంది. కొత్త శిఖరాలను అందుకొంటోంది; మరిన్ని ఎత్తులకు చేరుకోవాలన్న సంకల్పంతో అత్యంత కఠోరంగా పరిశ్రమిస్తోంది.
• ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపుర్, తెలంగాణ, ఇంకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మన కుమార్తెలు సప్త సముద్రాలను చుట్టి వచ్చిన శుభ తరుణం లో మనం ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకొంటున్నాం. వారు సప్త సముద్రాల లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మరీ ఆ రంగులతో సముద్రాలన్నింటినీ వర్ణమయం చేసి మన మధ్యకు తిరిగి వచ్చారు.
• మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న మన గిరిజన యువతీ యువకులు ఎవరెస్టు పర్వతం మీద మువ్వన్నెల జెండాను ఎగురవేసి ఆ పతాకం ప్రతిష్ట ను ఇనుమడింపచేశారు.
• దోపిడికి, పీడనకు, నిరాకరణకు గురైన దళితులకు, మహిళలకు జరిగిన అన్యాయం పట్ల తీవ్ర ఆవేదన తో వారి హక్కులను పరిరక్షించేందుకు పార్లమెంటు సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేసింది.
• ఒబిసి కమిశన్ కు రాజ్యాంగ ప్రతిపత్తి ని కల్పించాలన్న డిమాండు అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిమాండు. ఒబిసి కమిశన్ కు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం ద్వారా వెనుకబడిన తరగతులు, తీవ్రంగా వెనుకబడిన తరగతుల ప్రయోజనాల పరిరక్షణ కు పార్లమెంట్ ఈ సంవత్సరం చర్యలు తీసుకుంది.
• వరదల్లో చిక్కుకొని, తీవ్ర కష్టనష్టాల పాలైన, ఆత్మీయులను కోల్పోయిన బాధితులకు సహాయం అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని, వారికి అండగా యావత్తు దేశం నిలుస్తుందని మేము మరోసారి హామీ ఇస్తున్నాం. ఆత్మీయులను కోల్పోయిన వారందరికీ నేను నా హృదయాంతరాళం లో నుండి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.
• వచ్చే ఏడాదికి జలియన్ వాలా బాగ్ సామూహిక హత్య జరిగి 100 సంవత్సరాలు పూర్తి కానుంది. దేశ స్వాతంత్య్రం కోసం భారీ సంఖ్య లో ప్రజలు ప్రాణ త్యాగం చేశారు; దోపిడి పరిమితులన్నింటినీ దాటిపోయింది. అటువంటి సాహస హృదయులు అందరూ చేసిన త్యాగాలను జలియన్ వాలా బాగ్ దురంతం మనకు గుర్తు చేస్తుంది. వారందరికీ నేను నా మనస్సు లోలోపలి నుండి వందనమాచరిస్తున్నాను.
• భారతదేశం ప్రపంచం లోని ఆరో పెద్ద ఆర్థిక వ్యవస్థ గా అవతరించింది.
• దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ధైర్యవంతులైనటువంటి స్వాతంత్య్ర యోధులు అందరికీ దేశ ప్రజల పక్షాన నేను నా హృదయాంతరాళం నుండి నమస్కరిస్తున్నాను. మన సైనికులు, అర్థ సైనిక బలగాలు, పోలీసులు జాతీయ పతాకం యొక్క గౌరవాన్ని, ప్రతిష్ట ను కాపాడడానికి పగలు, రాత్రి అనే తేడా లేకుండా శ్రమిస్తున్నారు.
• స్వాతంత్య్రం వచ్చిన అనంతరం బాబా సాహెబ్ ఆంబేడ్ కర్ నాయకత్వం లో అత్యున్నత సమ్మిళిత రాజ్యాంగం రూపుదిద్దుకొంది. సరికొత్త భారతావని ని ఆవిష్కరించే సంకల్పం తో అది మన ముందుకు వచ్చింది.
• భారతదేశం ఎప్పుడూ శక్తివంతం గాను, స్వయం సమృద్ధం గాను, స్థిరమైన అభివృద్ధి ని సాధించేది గాను ఉండాలి. భారతదేశానికి విశ్వసనీయత ఒక్కటే కాదు, ప్రపంచం లో ప్రభావంతంగా కూడా ఉండాలని కోరుతున్నాం. దేశాన్ని అదే రకంగా తీర్చిదిద్దుతాం.
• 125 కోట్ల మంది యొక్క స్వప్నాలు, కఠోర శ్రమ, ఆకాంక్షలు ఒక్కటైనప్పుడు సాధించలేనిది ఏముంటుంది?
• 125 కోట్ల మంది 2014వ సంవత్సరం లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోనే ఆగిపోలేదు; వారు దేశాన్ని మరింత మెరుగ్గా నిలిపేందుకు నిరంతరం పాటుపడుతూ వస్తున్నారు. ఇదీ మన భారతదేశానికి ఉన్నటువంటి శక్తి.
• గత నాలుగు సంవత్సరాలలో జరిగిన పనులను గనక మీరు ఒకసారి పరిగణనలోకి తీసుకొన్నారంటే, దేశం ఎంత వేగంగా పురోగమించిందో, ఎంత వేగంగా ప్రగతి ని సాధించిందో తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు.
• 2013 సంవత్సరం నాటి వేగం తోనే మేము కదిలినట్లయితే బహిరంగ మల మూత్ర విసర్జ రహిత దేశం గా రూపుదిద్దుకొనేందుకు లేదా దేశం లోని ప్రతి ఒక్క ప్రాంతానికి విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించేందుకు లేదా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్క మహిళ కు ఎల్‌పిజి కనెక్షన్ ను అందించేందుకు శతాబ్దాల సమయం పట్టేది. 2013 నాటి వేగంతోనే మేం పని చేసినట్లయితే, దేశం మొత్తం ఆప్టిక్ ఫైబర్ తో అనుసంధానం కావడానికి ఒక తరం వ్యవధి పట్టేది. అన్ని లక్ష్యాలు సాధించడం కోసం మేము అదే వేగంతో పురోగమిస్తాం.
• గత నాలుగు సంవత్సరాలలో దేశం పరివర్తన ను చవి చూస్తోంది. సరికొత్త ఉత్సాహం తో, ఉత్తేజం తో, సాహసం తో దేశం పురోగమిస్తోంది. ఈ రోజున దేశం రెండింతల వేగంతో జాతీయ రహదారులను, నాలుగు రెట్ల వేగంతో గ్రామాల్లో ఇళ్లను నిర్మిస్తోంది.
• దేశం రికార్డు స్థాయి లో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసింది. రికార్డు సంఖ్యలో మొబైల్ ఫోన్ లు ఉత్పత్తి అవుతున్నాయి. ట్రాక్టర్ల అమ్మకాలు కొత్త గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి.
• దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత భారీ సంఖ్యలో విమానాలు కొనుగోలు చేయడం జరుగుతోంది.
• దేశంలో కొత్త ఐఐఎమ్ లు, ఐఐటి లు, ఎఐఐఎమ్ఎస్ లు ఏర్పాటు అవుతున్నాయి.
• చిన్న చిన్న పట్టణాల్లో కూడా కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమానికి ప్రోత్సాహం ఇస్తున్నాం.
• స్టార్ట్-అప్ ల కార్యక్రమం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పుట్టగొడుగుల్లా విస్తరించింది.
• దివ్యాంగులకు ‘ఉమ్మడి సంకేతాల’ తో కూడిన నిఘంటువు తయారు చేసే కృషి వేగంగా జరుగుతోంది.
• వ్యవసాయ రంగంలో ఆధునికత, సాంకేతికత, ఆధునిక పరిజ్ఞానం ప్రవేశించాయి. మన రైతన్నలు మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేశన్ విధానాలను అనుసరిస్తున్నారు.
• మన సైనికులు వైపరీత్యాల బారిన పడిన ప్రజలను సానుభూతి తో, దయాగుణం తో ఒక పక్క రక్షిస్తూనే, మరోపక్క సర్జికల్ దాడుల ద్వారా శత్రు మూకల పై దాడులు చేయగల సామర్ధ్యం కలిగి ఉన్నారు.
• మనం ఎప్పుడూ సరికొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలి. మన లక్ష్యం స్పష్టంగా లేకపోతే పురోగతి సాధ్యం కాదు. ఏళ్ళ తరబడి పరిష్కారానికి నోచుకోకుండా ఉండిపోయిన సమస్యలు ఒక కొలిక్కి వచ్చేవి కావు.
• రైతులకు ఆకర్షణీయమైన ధరలను అందించాలని మేం ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాం. చాలా పంటలకు కనీస మద్దతు ధరలను ఉత్పత్తి ధర కన్నా 1.5 రెట్లు, అంతకన్నా పైబడే పెంచడమైంది.
• చిన్న వ్యాపారుల సహాయం, కొత్త అంశాల పట్ల వారు చూపిన అభిరుచి, ఆసక్తి తో జిఎస్‌టి ని దేశంలో విజయవంతంగా అమలు చేయగలిగాం. వ్యాపారులలో అది సరికొత్త విశ్వాసాన్ని తీసుకు వచ్చింది.
• దేశానికి మేలు చేసే కాంక్షతో ఎంతో సాహసంగా బినామి ఆస్తుల చట్టాన్ని అమలు లోకి తెచ్చాం.
• భారతదేశ ఆర్థిక వ్యవస్థను అత్యంత రిస్కుతో కూడుకున్నదిగా ప్రపంచం మాట్లాడిన రోజులు ఉన్నాయి. కానీ, అదే ప్రజలు, అవే సంస్థలు మన సంస్కరణల తీరు ఆర్థిక వ్యవస్థ మూలాలను పటిష్టం చేసిందని ఎంతో విశ్వాసంతో చెబుతున్నారు.
• దేశంలో జాప్యాన్ని (రెడ్ టేప్) గురించి ప్రపంచం ఎంతగానో చెప్పుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజున ఘన స్వాగతాన్ని (రెడ్ కార్పెట్) గురించే చర్చిస్తున్నారు. ‘వ్యాపార సరళీకరణ’ లో మనం 100వ స్థానానికి చేరుకొన్నాం. ఈ రోజున ప్రపంచం యావత్తూ ఎంతో గర్వంగా మనం సాధించిన విజయాలను అవలోకిస్తోంది.
• దేశం ‘విధాన పరమైన అలసత్వం, సంస్కరణలలో జాప్యం’ తో కొట్టుమిట్టాడుతోందని ప్రపంచం ఒకప్పుడు చెప్పుకొంది. కానీ ఈ రోజున భారతదేశాన్ని ‘సంస్కరణ, కృషి, పరివర్తన’ కోణం లోనే చూస్తోంది.
• భారతదేశాన్ని ‘అత్యంత పెళుసైన అయిదు’ దేశాల్లో ఒకటిగా ప్రపంచం పరిగణించిన రోజులు ఉన్నాయి. కానీ, ఈ రోజున వేలాది కోట్ల డాలర్ ల పెట్టుబడుల గమ్యంగా భారతదేశాన్ని పరిగణిస్తోంది.
• దేశ ఆర్థిక వ్యవస్థ ను ‘నిద్రించిన గజ రాజు‘ లేచి పరుగులు తీస్తున్నట్టు ప్రపంచం చెప్పుకొంటోంది. వచ్చే మూడు దశాబ్దాల కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగం అందుకోవడానికి గణనీయమైన వాటా అందించగల ఆర్థిక వ్యవస్థ గా భారతదేశాన్ని గురించి ప్రపంచ ఆర్థికవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి.
• పలు అంతర్జాతీయ వేదికల్లో భారతదేశం ప్రాబల్యం పెరిగింది. అటువంటి వేదికల పై భారతదేశం తన వాదాన్ని బలంగా వినిపించగలుగుతోంది.
• గతంలో పలు అంతర్జాతీయ సంఘాల్లో సభ్యత్వం కోసం భారతదేశం ఎదురుచూసే పరిస్థితి ఉండేది. ఈ రోజున లెక్కలేనన్ని సంస్థలు భారతదేశానికి సభ్యత్వాన్ని అందించడానికి ముందుకు వస్తున్నాయి. భూతాపానికి సంబంధించిన కోణంలో ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని ఒక ఆశాకిరణం గా భావిస్తున్నాయి. భారతదేశం నాయకత్వంలో ఏర్పాటైన అంతర్జాతీయ సౌర కూటమి ని ప్రపంచం యావత్తూ స్వాగతించింది.
• ఈ రోజున క్రీడారంగంలో ఈశాన్య భారతం ఒక అద్భుతమైన ముద్ర వేసింది.
• ఈశాన్య ప్రాంతంలో వరుస క్రమంలో చిట్టచివరన ఉన్న గ్రామానికి కూడా విద్యుత్తు సౌకర్యాన్ని అందుబాటు లోకి తీసుకురావడమైంది.
• ఈశాన్య ప్రాంతం నుండి హైవే లు, రైల్వే లు, గగన యానం, జల మార్గాలు, సమాచార మార్గాల (ఐ-వేస్) కు సంబంధించి ప్రోత్సాహకరమైన వార్తలు అందుతున్నాయి.
• ఈశాన్య భారతానికి చెందిన యువత తమ ప్రాంతాలలోనే బిపిఒ లను ఏర్పాటు చేస్తున్నారు.
• ఈశాన్య ప్రాంతం సేంద్రియ వ్యవసాయానికి కేంద్రం గా మారింది. ఈశాన్యం లో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటవుతోంది.
• ఒకప్పుడు ఈశాన్య ప్రాంతం ఢిల్లీ కి సుదూరంగా ఉన్నట్లు భావించేది. కానీ, గత నాలుగేళ్ళ లో ఈశాన్యాన్ని ఢిల్లీ తో అనుసంధానం చేయడం తో విజయం సాధించాం.
• మన దేశంలో 65 శాతం జనాభా 35 సంవత్సరాల లోపు వయస్సు వారే. ఉద్యోగాల స్వభావం లో యువత గుణాత్మకమైన మార్పు ను తీసుకు వచ్చారు. స్టార్ట్-అప్ లు లేదా బిపిఒ లు, లేదా ఇ-కామర్స్ లేదా మొబిలిటీ - వంటి కొత్త విభాగాల్లో మన యువత ప్రవేశించారు. దేశాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు ఈ రోజున యువత కట్టుబాటుతో ఉన్నారు.
• 13 కోట్ల మంది ముద్ర రుణాలను ఉపయోగించుకోవడమే ఒక పెద్ద విజయం. వారిలో 4 కోట్ల మంది తొలిసారిగా రుణ సదుపాయం ఉపయోగించుకొని స్వయం ఉపాధి పొంది స్వతంత్రంగా పురోగమిస్తున్నారు. మారుతున్న వాతావరణానికి ఇదే ఒక చిహ్నం. మన యువత మూడు లక్షల గ్రామాల్లో ఉమ్మడి సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రతి ఒక్క గ్రామాన్ని, గ్రామీణ పౌరులను సమాచార సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రపంచంతో అనుసంధానం చేస్తున్నారు.
• మన శాస్త్రవేత్తల అన్వేషణ శక్తితో మత్స్యకారులు, ఇతరులకు ఉపయోగపడే ‘నావిక్’ (NAVIC) వ్యవస్థను త్వరలో ఆవిష్కరిస్తున్నాం.
• 2022 నాటికి మానవ సహిత అంతరిక్ష యానానికి భారతదేశం సమాయత్తం అవుతోంది. ఈ ఘనత ను సాధించిన నాలుగో దేశంగా భారతదేశం నిలవనుంది.
• వ్యవసాయం లో ఆధునికతను, పురోగతి కి అవకాశాలను కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి రైతాంగం ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నది మా స్వప్నం.
• ఆధునికత సహాయం తో వ్యవసాయ రంగం హద్దులను విస్తరించాలని మేం భావిస్తున్నాం. ‘విత్తనాల నుంచి విపణి’ వరకు విలువ జోడింపు మా లక్ష్యం. మన రైతన్నలు ప్రపంచ మార్కెట్ లో కూడా శక్తివంతంగా నిలిచేందుకు వ్యవసాయ ఎగుమతి విధానాన్ని తొలిసారిగా ప్రభుత్వం రూపొందిస్తోంది.
• సేంద్రియ వ్యవసాయం, నీలి విప్లవం, తేనెటీగల విప్లవం (మధుర విప్లవం), సౌర శక్తి ఆధారిత వ్యవసాయం లో కొత్త అవకాశాలను ఉపయోగించుకొని మరింత ముందుకు సాగాలని మేము కృషి చేస్తున్నాం.
• మత్స్య పరిశ్రమ లో భారతదేశం ప్రపంచం లోనే రెండవ పెద్ద దేశంగా మారింది.
• తేనె ఎగుమతులు రెట్టింపు అయ్యాయి.
• దేశం లో ఇథెనాల్ ఉత్పత్తి మూడు రెట్లు కావడం చెరకు రైతులకు ఆనందం కలిగించే అంశం.
• గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు ఇతర రంగాలు కూడా చాలా ప్రధానమే. అందుకే మహిళా స్వయం సహాయక బృందాల ఏర్పాటు, కోట్లాది రూపాయల సమీకరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వనరులను విశేషంగా పెంచాలని మేము కృషి చేస్తున్నాం. గ్రామాల సామర్ధ్యాన్ని పెంచాలని కూడా మేము ఆశిస్తున్నాం. ఇందుకు దీటుగా కృషి ని వేగవంతం చేస్తున్నాం.
• ఖాదీ అమ్మకాలు కూడా ఇప్పుడు రెట్టింపు అయ్యాయి.
• ఈ రోజున మన రైతన్నలు సౌర శక్తి ఆధారితమైన వ్యవసాయం పై దృష్టి సారిస్తున్నారు. తద్వారా వారు వ్యవసాయ రంగానికి అవసరమైన వాటా ను అందించడంతో పాటు, సౌర విద్యుత్తు ను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని కూడా ఆర్జించగలుగుతారు.
• అభివృద్ధి, ఆర్థిక పురోగతి లతో పాటు, అత్యంత ఉన్నతమైన మానవ జీవితం గౌరవాన్ని కాపాడాలని కూడా మేం ఆశిస్తున్నాం. అందుకోసం సగటు జీవి గర్వం తోను, గౌరవం తోను, హుందాతనం తోను జీవితం గడిపేందుకు అవసరమైన పథకాలను కొనసాగించాలని ప్రయత్నిస్తున్నాం.
• స్వచ్ఛత ప్రచార ఉద్యమం ద్వారా 3 లక్షల మంది బాల బాలికలకు రక్షణ లభించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక సూచిస్తోంది.
• గాంధీ జీ ‘సత్యాగ్రహీస్’ స్ఫూర్తితో మేం ‘స్వచ్చాగ్రహి’ లను కూడగట్టడంలో మేం విజయం సాధించాం. మహాత్ముని 150వ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారతదేశం రూపంలో బాపూ జీ కి ఘన నివాళి అర్పించేందుకు ‘స్వచ్ఛాగ్రహీ’ లు సిద్ధం అవుతున్నారు.
• ‘ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అభియాన్’ కింద నిరుపేదలకు ఉచిత ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెస్తున్నాం. ఈ పథకంలో భాగంగా ఏ వ్యక్తి అయినా మంచి ఆసుపత్రిలో చికిత్స తీసుకొని, వ్యాధుల నుండి విముక్తి ని పొందవచ్చు.
• ‘ఆయుష్మాన్ భారత్’ పథకం లో భాగంగా 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా ప్రయోజనం అందుబాటులోకి రానుంది. అంటే, 50 కోట్ల మందికి బీమా రక్షణ లభించనుంది. ప్రతి ఒక్క కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల విలువైన బీమా రక్షణ లభించగలదు.
• సాంకేతిక పరిజ్ఞానానికి, పారదర్శకత కు మేం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం వల్ల వివిధ రకాల సదుపాయాలు సగటు జీవికి అందడంలో అవరోధాలు అన్నీ తొలగి పోతాయి. ఈ లక్ష్యం తోనే సాంకేతిక పరికరాలను అభివృద్ధి చేస్తున్నాం.
• ‘ప్రధాన మంత్రి జన ఆరోగ్య అభియాన్’ ను ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన ప్రారంభించబోతున్నాం. సగటు జీవి ఇక నుండి ప్రాణాంతక వ్యాధుల సమస్యలతో బాధపడే అవసరం ఉండదు.
• మధ్యతరగతి కుటుంబాలకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఆరోగ్య రంగం లో యువత ప్రవేశించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలో ఆసుపత్రులను ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకు దీటుగా వైద్య సిబ్బంది భారీ సంఖ్యలో అవసరమవుతారు. రానున్న సంవత్సరాలలో ఎన్నో ఉపాధి అవకాశాలు అందుబాటు లోకి వస్తాయి.
• ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పేదల సాధికారిత కు మేం కృషి చేశాం. అయిదు కోట్ల మంది పేదలు పేదరికం రేఖ కన్నా పైకి వచ్చారని ఒక అంతర్జాతీయ సంస్థ తన నివేదికలో పేర్కొంది. పేదల సాధికానిత కు అనేక పథకాలు ఉన్నాయి. కానీ, మధ్యదళారీలు ఆ పథకాల తాలూకు ప్రయోజనాలను కాజేస్తున్నందువల్ల అవి పేదలకు చేరలేక పోతున్నాయి.
• అన్ని రకాల లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంది. అవినీతి ని, నల్లధనాన్ని నిర్మూలించే క్రమంలో ప్రభుత్వం పురోగమిస్తోంది. ఈ ప్రయత్నాలు అన్నింటి కారణంగా 90,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వ ఖజానా లోకి తీసుకు రాగలిగాం.
• నిజాయతీపరులు పన్నులను చెల్లిస్తున్నారు. వారి సొమ్ము తో పథకాలు అమలవుతున్నాయి. ఈ గొప్పతనం పన్ను చెల్లింపుదారులదే తప్ప ప్రభుత్వానికి కాదు.
• దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 70 సంవత్సరాల కాలంలో, అంటే 2013 సంవత్సరం వరకు, దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 4 కోట్లు. ఇప్పుడు వారి సంఖ్య ఇంచుమించుగా రెట్టింపు పెరిగి 7.25 కోట్లయింది.
• 70 సంవత్సరాల చరిత్ర లో పరోక్ష పన్ను శాఖ అధికారులు 70 లక్షల కోట్ల ఆదాయాన్ని మాత్రమే ఖజానాకు ఆర్జించి పెట్టగలిగారు. కానీ, జిఎస్‌టి అమలుతో ఏడాది కాలంలోనే 16 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది.
• నల్లధనాన్ని, అవినీతిని మేము క్షమించేది లేదు. ఎన్ని కష్టాలైనా ఎదురుకానీయండి, వారిని నేను విడచిపెట్టను. ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో పవర్ బ్రోకర్ లు కనిపించడం లేదు.
• పారదర్శకత కోసం మేం ఆన్‌లైన్ ఆధారిత విధానాలను ప్రవేశపెట్టాం. సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించుకొంటున్నాం.
• షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా సాయుధ దళాల్లోకి మహిళలను నియమిస్తున్నాం. ఈ విధానంలో పూర్తి పారదర్శకత ను పాటిస్తాం. పురుష అధికారులతో సమానంగానే మహిళా అధికారులను కూడా చూస్తాం.
• అత్యాచారం చాలా బాధాకరమైంది. కానీ, బాధితులు అనుభవించే బాధ అంత కన్నా బాధాకరం. ఈ అంశాన్ని దేశ ప్రజలు గుర్తించాలి. ప్రతి ఒక్కరు ఆ బాధ ను అనుభవం లోకి తెచ్చుకోవాలి.
• రాక్షస ప్రవృత్తి నుండి దేశాన్ని, సమాజాన్ని విముక్తం చేస్తాం. చట్టం ఈ దిశగా దాని పని అది చేసుకుపోతుంది. ఈ తరహా ధోరణులను, ఆలోచనలను ఎదుర్కొనేందుకు మేం గట్టిగా కృషి చేస్తాం. అన్ని రకాల వక్రపు ఆలోచనలను తొలగించి తీరాల్సిందే.
• ముమ్మారు తలాక్ ముస్లిమ్ మహిళల జీవితానికి ముప్పుగా పరిణమించింది. తలాక్ (విడాకులు) పొందని వారు కూడా అదే నావ లో ప్రయాణిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ఒక చట్టం చేయడం ద్వారా ముస్లిమ్ మహిళలకు ఈ దుఃఖం బారి నుండి విముక్తి ని కలిగించే ప్రయత్నాన్ని మేం చేశాం. కానీ, ఆ బిల్లు ఆమోదానికి కొందరు ఈ రోజుకీ సుముఖంగా లేరు.
• భద్రత దళాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా భాగస్వామ్యంతో అమలుపరుస్తున్న కార్యక్రమాల కారణంగా త్రిపుర, మేఘాలయ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం నుండి విముక్తి ని పొందాయి.
• జమ్ము & కశ్మీర్ లో అటల్ బిహారీ వాజ్‌పేయీ గారు అనుసరించిందే అత్యుత్తమైన మార్గం. అదే బాట లో మేం కూడా పయనించాలనుకొంటున్నాం. తుపాకి గుళ్లు, దురాగతాలు జరపడం కాకుండా, దేశ భక్తులైన కశ్మీరీ ప్రజలను అక్కున చేర్చుకొని మరింత ముందుకు సాగాలనుకొంటున్నాం.
• రానున్న నెలల్లో జమ్ము & కశ్మీర్ కు చెందిన గ్రామీణ ప్రజలు వారి హక్కులను ఆనందంగా అనుభవించగలుగుతారు. తమ సంక్షేమాన్ని తామే చూసుకోగలుగుతారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన అభివృద్ధి నిధులను భారత ప్రభుత్వం తగినంతగా అందించబోతోంది. పంచాయతీలు, స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఈ దిశగా మేం ముందుకు సాగుతున్నాం.
• సొంత ఇల్లు ఉండాలన్నది ప్రతి భారతీయుని కల. దానిని సాకారం చేసేందుకు ‘ప్రతి ఒక్కరికి ఇల్లు’ పథకాన్ని మేం తీసుకువచ్చాం. ఇళ్ళలో విద్యుత్తు వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్షించిన వారి కోసం గ్రామాల్నింటికీ విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించాం. ప్రతి గ్రామీణ కుటుంబం వంట గదిలో పొగ నుండి విముక్తి ని పొందాలని కోరుకొంటోంది. ఈ కల ను పండించేందుకు అందరికీ వంట గ్యాసు ను అందిస్తున్నాం. సురక్షితమైన తాగు నీరు ప్రతి ఒక్క భారతీయునికి అవసరం. అందుకే అందరికీ నీరు అందించడం మా లక్ష్యం. ప్రతి ఒక్క భారతీయునికి మరుగుదొడ్డి ఎంతో అవసరం. ప్రతి ఒక్కరికి పారిశుధ్యం కల్పించడం మా లక్ష్యం. నైపుణ్యాల అభివృద్ధి ప్రతి ఒక్క భారతీయునికి చాలా అవసరం. అందుకే, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని మేం తీసుకువచ్చాం. ఆరోగ్య సేవల్లో నాణ్యత ప్రతి ఒక్క భారతీయుని అవసరం. అందుకే అందరికీ ఆరోగ్యం పథకాన్ని చేపట్టాం. ప్రతి ఒక్క భారతీయునికి భద్రత అవసరం. అందుకోసం, ఆరోగ్య బీమా రక్షణను కల్పిస్తున్నాం. ఈ లక్ష్యాన్ని చేరుకొనేందుకు ప్రతి ఒక్కరికి బీమా కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంటర్‌నెట్ సదుపాయాన్ని కలిగి ఉండాలని ప్రతి ఒక్క భారతీయుడు అనుకొంటాడు. అందుకే మేం అందరికీ అనుసంధానాన్ని కల్పిస్తున్నాం. అనుసంధానం మంత్రంతో అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు నడిపించాలన్నదే మా ఆకాంక్ష.
• ఘర్షణ వైఖరి మాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్క దానికి అవరోధాలను మేము ఇష్టపడం. ఏ ఒక్కరి ముందు తల వంచాలని మేం భావించం. జాతి ఎప్పుడూ ఆగదు, దేని ముందు తల వంచదు. ఎప్పుడూ అలసట చెందదు. మనం కొత్త శిఖరాలకు అడుగులు వేయాలి. రానున్న సంవత్సరాలలో అసాధారణమైన పురోగతి ని సాధించడం మా లక్ష్యం.
*****