independenceday-2016

Press Information Bureau

Government of India

Prime Minister's Office

భారతదేశ 72 వ స్వాతంత్ర్య‌ దినోత్స‌వం సంద‌ర్భంగా 2018 ఆగ‌స్టు 15 వ తేదీన దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి చేసిన ప్ర‌సంగం

Posted On :15, August 2018 13:35 IST

ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా,

ఈ స్వాతంత్ర్య‌ దినోత్సవ శుభ స‌మ‌యం లో మీ అంద‌రికీ నేను నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. ఈ రోజు దేశం ఆత్మ‌విశ్వాసం తో తొణికిస‌లాడుతోంది. త‌న క‌ల‌ల‌ను సాకారం చేసుకోవాల‌న్న గ‌ట్టి సంక‌ల్పం తో క‌ష్టించి ప‌ని చేస్తూ దేశం స‌మున్న‌త శిఖ‌రాల‌ను చేరుకొంటోంది.. ఈ ఉషోద‌యం తనతో పాటే కొంగొత్త స్ఫూర్తి ని, నూత‌నోత్తేజాన్ని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త శ‌క్తి ని తీసుకు వ‌చ్చింది.

ప్రియ‌మైన నా దేశ వాసులారా, మ‌న దేశంలో నీల కురింజి పుష్ఫం ప్ర‌తి 12 సంవ‌త్స‌రాలకు ఒక‌సారి పుష్పిస్తుంది. ఈ ఏడాది ద‌క్షిణ నీల‌గిరి కొండ‌ల్లో నీల‌కురింజి పుష్పం మ‌న త్రివ‌ర్ణ‌ ప‌తాకం లోని అశోక చ‌క్రం లాగా పూర్తి స్థాయి లో విక‌సించింది.

ప్రియ‌మైన నా దేశ వాసులారా,

ఉత్త‌రాఖండ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, మ‌ణిపుర్‌, తెలంగాణ, ఆంధ్ర‌ ప్ర‌దేశ్ ల‌కు చెందిన‌ మ‌న ఆడ‌ప‌డుచు లు స‌ప్త స‌ముద్రాలను చుట్టివ‌చ్చిన శుభ‌ త‌రుణం లో మ‌నం ఈ స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని జ‌రుపుకొంటున్నాం. వారు స‌ప్త స‌ముద్రాల‌ లో మువ్వన్నెల జెండా ను ఎగుర‌వేశారు. ఆయా స‌ముద్ర‌ జ‌లాల‌ను త్రివ‌ర్ణ‌ ప‌తాకం లోని రంగుల‌తో వ‌ర్ణ‌రంజితం చేసి, త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్కరించి వారు తిరిగి వ‌చ్చారు.

ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా, ఎవ‌రెస్టు శిఖ‌రాన్నిమ‌న‌ వారు పలుమార్లు అధిరోహించిన శుభ‌ త‌రుణం లో ఈ స్వాతంత్ర్య‌ దినోత్స‌వాన్ని జ‌రుపుకొంటున్నాం. అస‌మాన ధైర్య‌సాహ‌సాలు గ‌ల వారు, అలాగే మ‌న ఆడ‌బ‌డుచులు ఎవ‌రెస్టు శిఖ‌రంపైన త్రివ‌ర్ణ‌ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. అంతేకాదు, ఈ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా నేను మీకు మ‌రొక‌ సంగతిని కూడా గుర్తు కు తీసుకురాద‌ల‌చాను. మారుమూల అట‌వీప్రాంతాల‌కు చెందిన మ‌న ఆదివాసీ యువ‌త ఎవ‌రెస్టు శిఖ‌రంపైన త్రివ‌ర్ణ‌ ప‌తాకాన్ని ఎగుర‌వేసి దాని ప్ర‌తిష్ఠ‌ ను ఇనుమడింపచేశారు.

ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా, లోక్‌ స‌భ‌, రాజ్య‌ స‌భ స‌మావేశాలు ఇటీవ‌లే ముగిశాయి. స‌భా కార్య‌క‌లాపాలను అత్యంత‌ క్ర‌మ‌బ‌ద్ధంగా నిర్వ‌హించ‌డాన్ని మీరు చూసే ఉంటారు. ఆ ర‌కంగా ఆ సమావేశాలను పూర్తిగా సామాజిక న్యాయానికే అంకిత‌ం చేయడమైంది.

ద‌ళితులు, ఆదరణకు నోచుకోని వ‌ర్గాల వారు, దోపిడి కి గురి అవుతున్న వారు, మ‌హిళ‌లు, స‌మాజం లోని బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌యోజ‌నాలను ప‌రిర‌క్షించేందుకు అత్యంత సున్నిత‌త్వాన్ని, అప్ర‌మ‌త్త‌త‌ ను ప్ర‌ద‌ర్శించి మ‌న పార్ల‌మెంట్ సామాజిక న్యాయ‌ చ‌ట్రాన్ని మ‌రింత బ‌లోపేతం చేసింది.

ఒబిసి క‌మిశన్‌ కు రాజ్యాంగ ప్ర‌తిప‌త్తి ని క‌ల్పించాల‌న్న డిమాండ్ అనేక సంవత్సరాల తరబడి ఉంది. ఈ సారి మ‌న పార్ల‌మెంట్ ఈ క‌మిశన్‌ కు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించింది. ఇలా చేయ‌డం ద్వారా వెనుక‌బ‌డిన‌, మ‌రింత వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ించేందుకు కృషి చేసింది.

ఈ రోజున, వార్త‌ాకథనాలు దేశం లో ఒక కొత్త స్పృహ‌ ను రేకెత్తించినటువంటి శుభ‌ త‌రుణంలో ఈ స్వాతంత్ర్య‌ దినోత్స‌వాన్ని మనం జ‌రుపుకుంటున్నాం. ఈ రోజు ప్ర‌పంచం న‌లు మూలలా నివసిస్తున్న ప్రతి ఒక్క భార‌తీయుడు కూడా ప్ర‌పంచం లో ఆరో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ గా భార‌త‌దేశం అవ‌త‌రించ‌డాన్ని చూసి గ‌ర్వపడతాడు. ఈ స్వాతంత్ర్య‌ దినోత్స‌వాన్ని ఇలాంటి అత్యంత సానుకూల ప‌రిణామాల మ‌ధ్య సకారాత్మకమైన వాతావ‌ర‌ణం లో మ‌నం జ‌రుపుకొంటున్నాం.

మ‌న దేశానికి స్వాతంత్ర్యాన్ని స‌ముపార్జించ‌డం కోసం పూజ్య‌ బాపూ జీ నాయ‌క‌త్వం లో ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు వారి జీవితాల‌ను త్యాగం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంద‌రో యువ‌త కారాగార జీవితాన్ని గ‌డిపారు. ఎంద‌రో గొప్ప విప్ల‌వ‌ యోధులు దేశం కోసం ఉరికంబాన్ని ధైర్యం గా ఆలింగనం చేసుకొన్నారు. ఆ వీరోచిత స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌కు నా దేశ ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఈ రోజు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారికి హృద‌య‌పూర్వ‌కంగా వంద‌నం స‌మ‌ర్పిస్తున్నాను.

త్రివ‌ర్ణ‌ ప‌తాకం గౌర‌వాన్ని కాపాడేందుకు మ‌న సైనికులు, అర్ధ సైనిక బ‌ల‌గాలు వారి ప్రాణాల‌ను త్యాగం చేస్తుంటాయి. ఇది జీవితం లోనూ మ‌ర‌ణం లోనూ మ‌నల్ని శిర‌సెత్తుకునేలా స్ఫూర్తినిస్తూ ఉంటుంది. మ‌న పోలీసు బ‌ల‌గాలు ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌ ను, భ‌ద్ర‌త ను క‌ల్పించ‌డం లో పగలు రాత్రి ఎరుగక సేవ‌ చేస్తుంటాయి.

ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి త్రివ‌ర్ణ‌ ప‌తాకం సాక్షి గా సైన్యం లోని జవానులకు, అర్ధ సైనిక బ‌ల‌గాలకు, పోలీసుల‌కు వారి యొక్క అంకితభావంతో కూడిన సేవ‌ కు, పరాక్రమానికి, క‌ఠోర‌ శ్ర‌మ‌ కు నేను ప్రణమిల్లుతున్నాను. వారికి ఎప్పుడూ నా శుభాభినంద‌న‌లు వెన్నంటి వుంటాయి.

ప్ర‌స్తుతం మ‌నం దేశం వివిధ ప్రాంతాల‌ నుండి ఒక‌వైపు మంచి వ‌ర్షాల గురించి, మ‌రోవైపు వ‌ర‌ద‌ల గురించిన వార్త‌లు వినవస్తున్నాయి. ఈ విప‌త్తు లో త‌మ ఆప్తుల‌ను కోల్పోయి విచారంలో ఉన్న ప్ర‌జ‌ల‌కు నేను భ‌రోసా ఇస్తున్నాను.. ఈ సంక్షోభ స‌మ‌యంలో మీకు స‌హాయం చేసేందుకు, మీరు ఈ క‌ష్ట స‌మ‌యం నుండి గట్టెక్కేందుకు మీ వెంట దేశం ఉంద‌ని. ఈ ప్ర‌కృతి వైప‌రీత్యంలో ఆప్తుల‌ను, మిత్రుల‌ను కొల్పోయిన వారి దు:ఖాన్ని, బాధ‌ ను నేను పంచుకొటున్నాను.

ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా,

వ‌చ్చే సంవత్సరానికి జ‌లియాన్ వాలా బాగ్ సామూహిక హత్య జ‌రిగి 100 సంవ‌త్స‌రాలు. ఆనాడు స్వాతంత్ర్యం సాధించడం కోసం, త‌మ‌పై జ‌రిగిన అన్నిర‌కాల అవ‌ధులు లేని దారుణాల‌ను ఎదురించి నిలబడి ఎంతోమంది మ‌న ప్ర‌జ‌లు వారి జీవితాల‌ను దేశం కోసం త్యాగం చేశారు. జ‌లియాన్‌ వాలా బాగ్ ఘ‌ట‌న మ‌న ప్ర‌జ‌ల వీరోచిత త్యాగాల‌ను గుర్తుకుతెస్తూ మ‌న‌కు స్ఫూర్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ వీరుల‌కు నా హృద‌యాంతరాళంలో నుండి నమస్కరిస్తున్నాను.

ప్రియ‌మైన నా దేశ వాసులారా,

మ‌నం మూల్యం చెల్లించుకున్న త‌రువాతే మ‌న‌కు స్వాత‌త్ర్యం సిద్ధించింది. పూజ్య బాపూ జీ తో పాటు విప్ల‌వ‌ యోధుల నాయ‌క‌త్వం లో ఎంద‌రో వీరులు, అస‌మాన ధైర్య‌సాహ‌సాలు గ‌ల స్త్రీ, పురుషులు, ఎంతో మంది స‌త్యాగ్రహులు, యువ‌కులు దేశ స్వాతంత్ర్య స‌మ‌రం లో పాలుపంచుకొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం జరిపిన పోరాటం లో భాగంగా వారు జైలు కు వెళ్లారు. య‌వ్వ‌నం లో ఎక్కువ భాగాన్ని వారు జైళ్ల‌ లోనే గ‌డిపారు. అయినప్పటికీ వారు ఇన్ని బాధ‌లను భరిస్తూనే అద్భుతమైన భార‌త‌దేశం కోసం నిరంత‌రం క‌ల‌లుగ‌న్నారు.

చాల సంవ‌త్స‌రాల క్రిత‌మే త‌మిళ జాతీయ క‌వి సుబ్ర‌మణియం భార‌తి దేశం గురించి త‌న దార్శ‌నిక‌త‌ ను ఇలా అక్ష‌రీకరించారు.

“एल्‍लारुम् अमरनिलई आईडुमनान

मुरईअई इंदिया उलागिरिक्‍कु अलिक्‍कुम”.

– ( “Ellarum amarnillai aaedumnaan
muraiai India ulagirakku allikkum”).

(“ఎల్లారుమ్ అమ‌రనినయీ ఆయ్‌డుమనాన్‌
ముర‌యీ ఇండియా ఉళగిర‌క్కు అలిక్కుమ్‌”)

స్వాతంత్ర్యం అనంత‌ర దేశాన్ని గురించి వారు ఎలాంటి క‌ల‌లు క‌న్నారు? అన్ని రూపాల‌ లోని బంధ‌నాల‌ నుండి విముక్త‌ం అయ్యేందుకు భార‌త‌దేశం ప్ర‌పంచానికి మార్గ‌నిర్దేశం చేస్తుంద‌న్నారు.

ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా,

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన త‌రువాత ఆ మ‌హ‌నీయులు క‌న్న‌ క‌ల‌లను సాకారం చేయ‌డానికి , స్వాతంత్ర్య‌ స‌మ‌ర‌ యోధుల ఆకాంక్ష‌లను నెర‌వేర్చ‌డానికి, దేశ ప్ర‌జ‌ల ఆశ‌లను, ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డానికి గౌర‌వ‌ బాబాసాహెబ్ ఆంబేడ్ కర్‌ గారి నాయ‌క‌త్వం లో భార‌తదేశం ఒక స‌మ్మిళిత రాజ్యాంగానికి రూప‌క‌ల్ప‌న చేసుకున్న‌ది. ఈ స‌మ్మిళిత రాజ్యాంగం న‌వ‌ భార‌త‌దేశ నిర్మాణానికి చెప్పుకున్న‌సంక‌ల్పానికి సూచిక‌.

ఇది మ‌న‌కు కొన్ని బాధ్య‌త‌లను, అలాగే కొన్ని హ‌ద్దుల‌ను కూడా ఏర్ప‌ర‌చింది. మ‌న రాజ్యాంగం మ‌న క‌ల‌ల‌ను పండించుకొనేందుకు మ‌న‌కు మార్గ నిర్దేశం చేస్తున్న‌ది. ఇలా ముందుకు సాగే క్ర‌మంలో స‌మాజం లోని ప్ర‌తి వ‌ర్గానికి, భౌగోళికంగా భార‌త‌దేశం లోని ప్ర‌తి ప్రాంతానికి స‌మాన అవ‌కాశాలు ద‌క్కాల‌ని స్ప‌ష్టం చేస్తున్న‌ది.

ప్రియ‌మైన సోద‌రీ సోద‌రులారా,

మ‌న త్రివ‌ర్ణ ప‌తాకం నుండి స్ఫూర్తి ని పొందేందుకు మ‌న రాజ్యాంగం మ‌న‌కు మార్ద‌నిర్దేశం చేస్తున్న‌ది. మ‌నం పేద‌ల‌కు న్యాయం జ‌రిగేందుకు పూచీ ప‌డాల‌ని, అంద‌రికీ స‌మాన అవ‌కాశాల‌తో ముందుకు వెళ్లాల‌ని, మ‌న దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు త‌మ అభివృద్ధిలో ఎలాంటి అడ్డంకులను ఎదుర్కోకూడద‌ని, వారికి అడ్డుగా ప్ర‌భుత్వం రాకూడ‌ద‌ని, వారి క‌ల‌ల‌ను సాకారం కాకుండా సామాజిక వ్య‌వ‌స్థ అడ్డుప‌డ‌రాద‌ని సూచిస్తోంది. వారు అవ‌కాశాలను గ‌రిష్ఠ స్థాయిలో పొందుతూ పురోగ‌తి ని సాధించి విక‌సించే అవ‌కాశాన్ని మ‌నం క‌ల్పించాల‌ని, ఎలాంటి ప‌రిమితులు లేకుండా వారు పురోభివృద్ధిని సాధించ‌డానికి అవ‌కాశం క‌ల్పించాల‌ని తెలియ‌జేస్తోంది.

వారు మ‌న పెద్ద‌లు కావ‌చ్చు, దివ్యాంగులు కావ‌చ్చు, మ‌హిళ‌లు, అణ‌గారిన వ‌ర్గాలు, లేదా అడ‌వుల‌లో నివ‌సించే మ‌న ఆదివాసీ సోద‌రులు.. ఇలా అంద‌రూ వారి యొక్క ఆశ‌లకు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా వృద్ధి లోకి రావ‌డానికి ప్ర‌తి ఒక్కరికీ అవ‌కాశం క‌ల్పించాలి. మ‌నం బ‌ల‌మైన‌, స్వావ‌లంబ‌న‌ తో కూడిన‌, సుస్థిర ప్ర‌గ‌తి ని సాధించే, నూత‌న శిఖ‌రాల‌ను అందుకునే దేశాన్ని, ప్ర‌పంచం లో మంచి ప్ర‌తిష్ఠ క‌లిగిన దేశాన్ని కోరుకుంటున్నాం. అంతేకాదు, భార‌త‌దేశం ప్ర‌పంచంలో మెరుపులు చిమ్మేటటువంటి భార‌త‌దేశాన్ని నిర్మించాల‌ని కోరుకుంటున్నాం.

ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా, నేను గ‌తంలో కూడా టీమ్ ఇండియా పై నా ఆలోచ‌నలను గురించి వివ‌రించి వున్నాను. 125 కోట్ల మంది ప్ర‌జ‌లు భాగ‌స్వాములైతే, దేశ పురోభివృద్ధి లో దేశ పౌరులు ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములైతే 125 కోట్ల క‌ల‌లు, 125 కోట్ల సంక‌ల్పాలు, 125 కోట్ల ప్ర‌య‌త్నాలు, మ‌నం సాధించ‌ద‌ల‌చిన ల‌క్ష్యాల‌ దిశ‌గా స‌రైన ప‌థంలో ముందుకు సాగితే సాధించ‌లేనిది అంటూ ఉండనే ఉండదు.

ప్రియ‌మైన నా సోద‌రీ సోదరులాలారా, అత్యంత విన‌మ్ర‌త‌ తోను, అమిత గౌర‌వం తో నేను మీకు ఒక విష‌యాన్ని చెప్ప‌ద‌ల‌చాను. 2014 లో ప్ర‌జ‌లు ప్ర‌భుత్వానికి వోటు వేసిన త‌రువాత విశ్ర‌మించ‌లేదు. ప్ర‌భుత్వం ఏర్పాటు తో ఆగిపోలేదు, దేశ నిర్మాణం కోసం ప‌నిచేశారు. వారు క‌లిసి ముందుకు వ‌చ్చారు, క‌లిసే ఉన్నారు, ఇక ముందుకూడా క‌లిసే ఉంటారు. దేశం లోని సుమారు 6 ల‌క్ష‌ల గ్రామాల‌కు చెందిన 125 కోట్ల‌ మంది క్రియాశీల‌ పౌరులు స‌మాహారమే భార‌త‌దేశ‌పు నిజ‌మైన శ‌క్తి. ఈరోజున మ‌నం శ్రీ అర‌విందుల‌ వారి జ‌యంతి ని జ‌రుపుకొంటున్నాం. వారు చాలా ముఖ్య‌మైన విష‌యాన్ని చెప్పారు. దేశ‌మంటే ఏమిటి? మ‌న జ‌న్మ‌భూమి అంటే ఏమిటి? ఇది కేవ‌లం ఒక గుర్తింపు లేదా భూమి తున‌క‌, లేదా కేవ‌లం ఒక గుర్తింపు లేదా ఒక ఊహాజ‌నిత భావ‌న కానే కాదు. దేశమనేది, దానికి ఒక ప‌టిష్ట నిర్మాణాత్మ‌క రూపును ఇచ్చేందుకు ఎన్నో వ్య‌వ‌స్థీకృత విభాగాల నుండి రూపొందిన ఒక గొప్ప శ‌క్తి భాండాగారం. అర‌విందుల వారి ఈ ఆలోచ‌నే దేశాన్ని ఐక్యంగా ఉంచి ముందుకు తీసుకుపోతున్న‌ది. మ‌నం వాస్త‌వానికి ఎక్క‌డి నుండి మొద‌ల‌య్యామో తెలిస్తే కాని మ‌నం వాస్త‌వానికి ముందుకు క‌దులుతున్నామ‌న్న విష‌యాన్ని తెలుసుకోవ‌డం క‌ష్టం. మ‌నం మ‌న ప్ర‌యాణాన్ని ఎక్క‌డి నుండి ప్రారంభించామో మ‌నం చూసుకోకుంటే, మ‌నం ఎంత వ‌ర‌కు వ‌చ్చామో తెలుసుకోవ‌డం సాధ్యం కాదు. సంక్షిప్తంగా చెప్పాలంటే, అందుకే 2013ను మ‌నం ఆధార సంవ‌త్సరం గా తీసుకొని గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాలుగా జ‌రిగిన ప‌ని ని బేరీజు వేసుకుంటే, మ‌న దేశం ఎంత వేగంతో ముందుకు సాగిపోతోందో, అభివృద్ధి ఏ వేగంతో జ‌రుగుతోందో తెలుసుకొని ఆశ్చ‌ర్య‌పోతారు. ఉదాహర‌ణ‌కు శౌచాల‌యాల నిర్మాణాన్నే తీసుకోండి, మ‌నం 2013 లో ఉన్న వేగంతోనే మరుగుదొడ్ల నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే నూరు శాతం ల‌క్ష్యాన్ని సాధించ‌డానికి ద‌శాబ్దాలు ప‌ట్టివుండేది.

2013లో జ‌రిగిన పని తో గ్రామాల‌కు విద్యుత్తు స‌దుపాయాన్ని క‌ల్పించ‌డం గురించి మాట్లాడుకున్న‌ట్ట‌యితే, ఈ ప‌ని ని పూర్తి చేయ‌డానికి మ‌రికొన్ని ద‌శాబ్దాలు ప‌ట్టి ఉండేది. పేద‌ల‌కు , పేద త‌ల్లులకు పొగ‌ బారి నుండి విముక్తి ని క‌ల్పించేందుకు ఎల్‌పిజి గ్యాస్ క‌నెక్ష‌న్ స‌దుపాయం క‌ల్పించ‌డం గురించి చెప్పుకుంటే, 2013 నాటి ప‌రిస్థితి తో పోల్చి అదే వేగంతో వెళితే మ‌రో 100 సంవ‌త్స‌రాల‌లో కూడా పూర్తి చేయ‌లేక‌ పోయే వాళ్లం. గ్రామాల‌లో ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్ వ‌ర్క్ ఏర్పాటు ను 2013 నాటి వేగంతో ప‌నులు చేసివుంటే మ‌న ల‌క్ష్యం కొన్ని త‌రాల‌కు కూడా పూర్తి అయ్యేది కాదు. మ‌నం అభివృద్ధి లో ప్ర‌స్తుత వేగాన్ని కొన‌సాగించడానికి శ్రమిద్దాం.

సోద‌రీ సోద‌రులారా, దేశ ప్ర‌జ‌ల‌కు ఆకాంక్ష‌లు అనేకం ఉన్నాయి. దేశానికి అవ‌స‌రాలు అనేకం ఉన్నాయి. వాటిని నెర‌వేర్చాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు క‌లిసిక‌ట్టుగా, స్థిరంగా నిరంత‌రాయంగా ప‌నిచేయవ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇవాళ మ‌నం దేశంలో ఒక గొప్ప మార్పు ను చూస్తున్నాం. దేశం అదే, మ‌ట్టి అదే, గాలి అదే, స‌ముద్రం అదే, ఆకాశ‌మూ అదే, ఫైళ్లూ అవే, నిర్ణ‌యాలు తీసుకునే విధాన‌మూ అదే. అయినా దేశం గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌లో గొప్ప మార్పున‌కు నోచుకొంటోంది. కొత్త స్ఫూర్తి, కొత్త శ‌క్తి, కొత్త సంక‌ల్పం, కొత్త ప‌ట్టుద‌ల‌, కొత్త‌ప్రేర‌ణ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి. అందుకే దేశం జాతీయ‌ ర‌హ‌దారుల నిర్మాణ రంగంలో రెట్టింపు వేగం తో ముందుకు కదలుతున్న‌ది. గ్రామీణ ప్రాంతాల‌లొ కొత్త ఇళ్ల నిర్మాణం నాలుగు రెట్లు పెరిగింది. ఆహారోత్ప‌త్తి మున్నెన్న‌డూ లేని స్థాయిలో గ‌రిష్ఠ‌ స్థాయి కి చేరింది. మొబైల్ ఫోన్ ల ఉత్ప‌త్తి రికార్డు స్థాయిలో జ‌రుగుతోంది. ట్రాక్ట‌ర్ల అమ్మ‌కాలు కొత్త రికార్డులను నెల‌కొల్పుతున్నాయి. ఇవాళ‌ ఒక‌వైపు మ‌న రైతులు రికార్డు సంఖ్య‌లో ట్రాక్ట‌ర్లు కొంటుంటే, అదే స‌మ‌యంలో దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌రువాతి కాలంలో మున్నెన్న‌డూ లేని రీతిలో విమానాల కొనుగోళ్ల‌నూ దేశం చూస్తున్న‌ది. పాఠ‌శాల‌ల్లో టాయిలెట్ ల నిర్మాణం జ‌రుగుతున్న‌ది. కొత్త ఐఐఎమ్ లు, కొత్త ఐఐటి లు, కొత్త ఎఐఐఎమ్ఎస్‌ లు ఏర్పాట‌వుతున్నాయి. నైపుణ్యాభివృద్ధి మిశన్‌ కు కొత్త ఊపు వ‌చ్చింది. చిన్న ప‌ట్ట‌ణాల‌లో నైపుణ్యాభివృద్ధి కి సంబంధించిన నూతన కేంద్రాలు ఏర్పాట‌వుతున్నాయి. అదే స‌మ‌యంలో ద్వితీయ‌ శ్రేణి న‌గ‌రాల‌లో, తృతీయ శ్రేణి న‌గ‌రాల‌లో స్టార్ట్- అప్ సంస్థ‌లు వ‌ర‌ద‌లా వ‌స్తున్నాయి. ఇది కొత్త అభివృద్ధి కి బాట‌లు వేస్తోంది.

సోద‌రీ సోదరులారా,

డిజిట‌ల్ ఇండియా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్న‌ది. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ ప‌ట్ల సున్నిత‌త్వం క‌లిగిన ప్ర‌భుత్వంగా, డిజిట‌ల్ ఇండియా ను సాకారం చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అదే స‌మ‌యం లో అదే చిత్త‌శుద్ది తో దివ్యాంగ సోద‌ర సోద‌రీమ‌ణుల కోసం సాధార‌ణ ఉమ్మ‌డి సంకేతాల‌కు సంబంధించిన నిఘంటు రూప‌క‌ల్ప‌ న‌కు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. ఒక‌ వైపు మ‌న రైతులు సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం, తుంప‌ర సేద్యం ల వంటి ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ను అనుస‌రిస్తుంటే, మ‌రో వైపు ఇప్ప‌టికే మూసివేసిన 99 భారీ నీటిపారుద‌ల ప్రాజెక్టుల‌ను పున‌రుద్ధ‌రించ‌డం జ‌రిగింది. మ‌న సైనికులు ప్ర‌కృతి వైప‌రీత్యాల స‌మ‌యంలో స‌హాయ పున‌రావాస కార్య‌క‌లాపాలను చేప‌డుతుంటారు. అత్యంత క్లిష్ట ప‌రిస్థితుల‌లో ఉన్న ప్ర‌జ‌ల‌ను ఆదుకోవడానికి మ‌న సైనికులు అస‌మాన ధైర్య‌సాహ‌సాలను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అదే స‌మ‌యం లో వారు శ‌త్రువును తుదముట్టించేందుకు స‌ర్జిక‌ల్‌ దాడులు చేప‌ట్టేందుకు చెప్పుకున్న‌ ఉక్కు సంక‌ల్పాన్నీ మ‌న‌కు ఆచ‌ర‌ణ‌ లో చూపించారు.

దేశం లో విస్తృత అభివృద్ధి తీరు ను ఒక చివ‌రి నుండి మ‌రొక చివ‌రి వ‌ర‌కు ప‌రిశీలించి చూడండి. కొత్త ఉత్సాహం తో, కొత్త శ‌క్తి తో దేశం ఎలా ముందుకు దూసుకుపోతున్న‌దీ గ‌మ‌నించ‌గ‌ల‌రు. నేను గుజ‌రాత్‌ నుండి వ‌చ్చాను. గుజ‌రాతీ లో ఒక నానుడి ఉంది.. ‘నిషాన్ చూక్ మాఫ్ లేకిన్ న‌హీ మాఫ్ నిచూ నిషాన్’ అని. అంటే- ఎవ‌రికైనా పెద్ద పెద్ద ల‌క్ష్యాలు, క‌లలు ఉండాలి. అయితే, ఆ క‌ల‌ల‌ను, ల‌క్ష్యాల‌ను సాకారం చేసుకోవ‌డానికి వారు బాగా క‌ష్ట‌ప‌డాలి, జ‌వాబుదారుగా ఉండాలి- అని. ల‌క్ష్యాలు పెద్ద‌విగా లేక‌పోతే, ల‌క్ష్యాలు దూర‌దృష్టి క‌లిగిన‌వి కాక‌పోతే, నిర్ణ‌యాలు తీసుకోక‌పోతే అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే నా ప్రియ‌మైన సోద‌రీ సోదరులారా, పెద్ద పెద్ద సంక‌ల్పాలతో, పెద్ద ల‌క్ష్యాల‌తో మనం ముందుకుసాగి పోవాలి.
మ‌న ల‌క్ష్యాలు బ‌ల‌హీనంగా ఉంటే, మ‌న స్ఫూర్తి బ‌లంగా లేక‌పోతే, మ‌న సామాజిక జీవితానికి సంబంధించిన ప్ర‌ధాన నిర్ణ‌యాలు సంవ‌త్స‌రాలుగా అక్క‌డే ఆగిపోతాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఎమ్ఎస్‌పి నే తీసుకోండి, ఆర్థిక‌వేత్త‌లు, రైతు సంఘాలు, రైతులు, రాజ‌కీయ పక్షాలు.. అన్నీ కూడా రైతుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎమ్ఎస్‌పి) ల‌భించాల‌ని, అది వారి పెట్టుబ‌డి కి ఒక‌టిన్న‌ర రెట్లు ఉండాల‌ని డిమాండ్ చేస్తూ వ‌చ్చాయి. ఈ అంశంపై సంవ‌త్స‌రాల కొద్దీ చ‌ర్చ జ‌రిగింది. ఫైళ్లు అటూ , ఇటూ తిరిగాయి. కానీ ఆగిపోయాయి. చివ‌ర‌కు మేం నిర్ణ‌యం తీసుకున్నాం. రైతుల పెట్టుబడికి ఒక‌టిన్న‌ర రెట్లు మ‌ద్ద‌తు ధ‌రను ఇచ్చే విష‌యంలో మేం సాహ‌సోపేతమైనటువంటి నిర్ణ‌యాన్ని తీసుకున్నాం.

జిఎస్‌టి పై అంద‌రికీ ఏకాభిప్రాయం ఉంది. ప్ర‌తి ఒక్క‌రూ జిఎస్‌టి కావాల‌నుకున్నారు. అయినా వారు ఒక నిర్ణ‌యానికి రాలేక‌పోయారు. ఎందుకంటే వారు వారి స్వీయ ప్రయోజ‌నాల కోణంలో నుండి ఆలోచిస్తూ వ‌చ్చారు. అలా ఇది ఎన్నిక‌ల ప్ర‌యోజ‌నాలు ఇవ్వ‌దా అన్న‌ది వారి భావ‌న‌. కానీ ఇవాళ చిన్న వ్యాపారుల స‌హాయంతో, వారి విశాల భావంతో, కొత్త విధానాన్ని అంగ‌క‌రించాలన్న వారి వైఖ‌రితో దేశం జిఎస్‌టి ని అమ‌లు చేసింది.. వ్యాపార వ‌ర్గాల‌లో ఒక కొత్త విశ్వాసం ఏర్ప‌డింది. చిన్న వాణిజ్య‌వేత్త‌లు, చిన్న వ్యాపారాల వారు జిఎస్‌టి విధానాన్ని అందిపుచ్చుకోవ‌డంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఆ స‌వాలును స్వీక‌రించి దేశం ఇవాళ ముందుకు పోతోంది.

ఇవాళ‌, మ‌నం బ్యాంకింగ్‌రంగాన్ని ప‌టిష్ఠం చేసుకునేందుకు ఇన్‌సాల్వెన్సీ, దివాలాల‌కు సంబంధించి చ‌ట్టాలు చేశాం. వీటిని గ‌తంలో ఎవ‌రు వ్య‌తిరేకించారు? నిర్ణ‌యాలు తీసుకోవాలంటే అందుకు సంక‌ల్పం కావాలి. శ‌ క్తి కావాలి. విశ్వాసం ఉండాలి. సామాన్యుడికి మంచి చేయ‌డం ప‌ట్ల అంకిత‌భావం ఉండాలి. గ‌తంలో బినామీ ప్రాప‌ర్టీ చ‌ట్టం ఎందుకు చేయ‌లేక‌పోయారు ? దేశం కోసం ఏదైనా చేయాల‌న్న ధైర్యం, సంక‌ల్పం ఉంటేనే బినామీ ఆస్తుల చ‌ట్టం వంటివి అమ‌లు చేయ‌గ‌లుగుతాం. మ‌న ర‌క్ష‌ణ ద‌ళాల‌కు చెందిన వారు ఒక ర్యాంకు, ఒక పెన్ష‌న్ విధానాన్ని కొన్ని ద‌శాబ్దాలుగా డిమాండ్ చేస్తూ వ‌చ్చారు. వారు క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన వారు క‌నుక వారు ఆందోళ‌న‌ల‌కు దిగ‌కుండా ఉంటూ వ‌చ్చారు. కానీ వారి అభిప్రాయాల‌ను ఎవరూ ప‌ట్టించుకోలేదు. ఈ విష‌యంలో ఎవ‌రో ఒక‌రు నిర్ణ‌యం తీసుకోవాలి. ఈ విష‌యంలో నిర్ణ‌యం తీసుకొనే బాధ్య‌త‌ ను మీరు మాపై ఉంచారు. దానికి అనుగుణంగా దీనిని మేం సానుకూల‌త‌ తో నెర‌వేర్చాం.

ప్రియమైన నా సోదరీ సోదరులారా,

మేం పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్లం కాదు. జాతి ప్రయోజనాలే మా పరమావధి గనుక అత్యంత కఠిన నిర్ణయాలను తీసుకోగల సామర్థ్యం మాకు ఉంది. ప్రపంచమే ఒక ఆర్థిక వ్యవస్థ గా రూపొందుతున్న యుగమిది.. కాబట్టే భారతదేశం లో సంభవించే ప్రతి పరిణామాన్ని- అది పెద్దదైనా, చిన్నదైనా- యావత్తు ప్రపంచం అత్యంత ఆసక్తితో, ఆశాభావంతో, అంచనాలతో గమనిస్తూ ఉంటుంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధ సంస్థలు, అగ్రగణ్యులైన ఆర్థికవేత్తలు, ఈ అంశంపై మేధావులుగా పేరున్న ప్రముఖులు 2014కు ముందు భారతదేశం గురించి చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తుండే ఉంటాయి. భారతదేశాన్ని ముప్పు తో కూడిన ఆర్థిక వ్యవస్థ గా నిపుణులు పరిగణించిన కాలం అది. అయితే, మన సంస్కరణల వేగం మన ఆర్థిక మూలాలను మరింత బలోపేతం చేసినట్లు అదే నిపుణులు, సంస్థలు నేడు కొనియాడుతుండటం గమనార్హం. ఈ మార్పు ఎలా సాధ్యమైంది? అలాగే ఒకప్పుడు భారతదేశంలో ‘సహించలేని సాచివేత’ (రెడ్ టేప్) గురించి వ్యాఖ్యానించేది.. కానీ ఇప్పుడు ‘సాదర స్వాగతం’ (రెడ్ కార్పెట్) గురించి చెప్పుకుంటోంది. ‘వాణిజ్య సౌలభ్యం’ ర్యాంకు లలో మనం 100వ స్థానానికి దూసుకుపోయాం. ఈ విజయాన్ని ప్రపంచమంతా ఇవాళ సగర్వంగా పరికిస్తోంది. ఒకనాడు ‘విధానపరమైన పక్షవాతం’, ‘సంస్కరణల జాప్యం’తో అల్లాడుతున్న దేశంగా భారత్ గురించి ప్రపంచం భావించేది. పాత వార్తాపత్రికల కథనాలను చూస్తే ఈ భావన స్పష్టమవుతుంది. అయితే, నేడు భారతదేశంపై ప్రపంచ దృక్పథం పూర్తిగా మారింది. సంస్కరణలపై మన శ్రద్ధను, పనితీరును, పరివర్తనను ఇప్పుడందరూ ప్రశంసిస్తున్నారు. దీనికి అనుగుణంగా వ్యవధి నిర్దేశిత విధాన నిర్ణయాల పరంపర దేశ స్వరూపాన్నే మార్చివేసింది. లోగడ భార‌త్‌ ను ‘పంచ దుర్బల’ దేశాల జాబితాలో చేర్చిన ప్రపంచం- అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ను దిగలాగుతున్న దేశంగా మన గురించి ఆందోళన వ్యక్తం చేసింది. కానీ... నేడు భారతదేశం బహు కోటానుకోట్ల డాలర్ల పెట్టుబడి గమ్యస్థానం గా మారిన నేపథ్యం లో నేడు ఆ గళాల్లో మార్పు ధ్వనిస్తోంది.

ప్రియమైన నా సోదరీ సోదరులారా,

భారతదేశంలో పెట్టుబడుల విషయంలో ఇక్కడ మౌలిక సదుపాయాల లేమి, విద్యుత్తు కొరత ల కారణంగా సరఫరాలో తరచుగా అంతరాయాలు, అనేకానేక అడ్డంకుల గురించి ఆందోళన ను వ్యక్తం చేసే వారు. ఒకనాడు భారతదేశాన్ని ‘నిద్రిస్తున్న ఏనుగు’ గా అభివర్ణించిన నిపుణులే- ఇవాళ నిద్ర లేచి ‘పరుగుతీస్తున్న గజరాజు’గా కీర్తిస్తున్నారు. భారత్ రాబోయే మూడు దశాబ్దాల పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వేగమిచ్చి అంతర్జాతీయ వృద్ధి ని ఉత్తేజితం చేయగలదని ఆర్థికవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు చెబుతుండటం విశేషం.

అంతర్జాతీయ వేదికలపై భారత ఔన్నత్యం సమున్నత శిఖరాలను అందుకుంది. తాను సభ్య దేశంగా గల ప్రతి ప్రపంచ స్థాయి సంస్థ లోనూ భారత గళానికి గౌరవాదరణలు ఇనుమడించాయి. ఆయా సంస్థలకు మార్గదర్శనంతో పాటు నాయకత్వాన్ని అందిస్తూ వాటికొక ఉన్నత స్వరూపమివ్వడంలో భారత్ కీలక పాత్రను పోషిస్తోంది. అనేక అంతర్జాతీయ వేదికలపై మన గళాన్ని మనం బలంగా వినిపిస్తున్నాం.

ప్రియమైన నా దేశ వాసులారా, కొన్ని అంతర్జాతీయ సంస్థలలో సభ్యత్వం కోసం మనం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. కానీ, ఇవాళ మన దేశం లెక్కలేనన్ని సంస్థలలో సభ్యత్వం సాధించింది. భూ తాపంపై, పర్యావరణ సమస్యలపై ఆందోళన చెందుతున్న దేశాలకు భారత్ నేడు ఓ ఆశాకిరణంలా కనిపిస్తోంది. తదనుగుణంగా ఈ రోజున అంతర్జాతీయ సౌరశక్తి కూటమి కి పతాక ధారి గా భారతదేశం ప్రపంచ మన్నన పొందుతోంది. తమ నేలపై పాదం మోపే ఏ భారతీయుడికైనా సాదర స్వాగతం పలికేందుకు ప్రపంచం లోని ప్రతి దేశం ఆసక్తి చూపుతోంది. భారతీయుల పట్ల వారి దృక్పథంలో కొత్త చైతన్యం వారి కళ్లలో ప్రస్ఫుటమవుతోంది. భారతీయ పాస్‌పోర్ట్ కు బలం రెట్టింపైంది. ఇది ప్రతి భారతీయుడి లో కొత్త ఆత్మవిశ్వాసాన్ని, తాజా శక్తి ని, నవ సంకల్పాన్ని నింపి వారు సరికొత్త ఆశాభావంతో ముందడుగు వేసేలా చేస్తోంది.

ప్రియమైన నా దేశ ప్రజలారా, ప్రపంచం లోని ఏ ప్రాంతంలో గల భారతీయుడికైనా కష్టమొస్తేనో, నిరాశ ఆవరిస్తేనో కుంగిపోవాల్సిన దు:స్థితి ఇప్పుడు లేదు. ప్రతి దశ లోనూ తన దేశం తనతో ఉందన్న భరోసా ఉంటుంది గనుక వారు నిశ్చింతగా నిద్రించగలుగుతారు. ఇటీవల చోటు చేసుకున్న అనేక సంఘటన లలో భారతీయులకు లభించిన ఊరటే ఇందుకు నిదర్శనం.

ప్రియమైన నా సోదరీ సోదరులారా.. భారత్ విషయం లో ప్రపంచ దృక్పథం లో పరివర్త వచ్చిన తరహా లోనే- ఒకప్పుడు ఈశాన్య భారతం నుండి వచ్చే వార్త లలో ఆశించిన సమాచారం ఉండేది కాదు. అయితే,
ప్రియమైన నా సోదరీసోదరులారా- ఇవాళ ఈశాన్య భారతం ఆశావహమైన, స్ఫూర్తిదాయకమైన కథనాలతో ముందడుగు వేస్తోంది.. ముఖ్యంగా క్రీడా క్షేత్రంలో ఈశాన్య భారతం విశేషంగా రాణిస్తోంది.

ప్రియమైన నా సోదరీ సోదరులారా.. ఈ రోజున ఈశాన్య భారతం లోని చిట్టచివరి గ్రామానికి విద్యుత్తు సరఫరా అయిందన్న వార్తను మనం వినే సరికి ఆ గ్రామం మొత్తం రాత్రంతా ఆనంద నాట్యం చేసింది. అలాగే ఈ ప్రాంతం లోని జాతీయ రహదారులు, రైలు మార్గాలు, విమాన మార్గాలు, జలమార్గాలు, సమాచార సాంకేతికత మార్గాలు (i-ways) వంటివాటి గురించి మరిన్ని వార్తలను మనమిప్పుడు వింటున్నాం. ఈశాన్య భారత ప్రాంతంలో విద్యుత్తు సరఫరా మార్గాల విస్తరణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. అలాగే అక్కడి యువత ఆ ప్రాంతంలో బిపిఒ లను ఏర్పాటు చేస్తున్నారు.. కొత్త విద్యా సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. సేంద్రియ వ్యవసానికి ఓ కొత్త కూడలి గా ఈశాన్య భారతం ఆవిష్కృతమవుతోంది. దీంతోపాటు క్రీడా విశ్వవిద్యాలయం కూడా అక్కడ ఏర్పాటవుతోంది.

సోదరీ సోదరులారా, ఢిల్లీ చాలా దూరంలో ఉందని ఇంతకు ముందు ఈశాన్య భారతం భావించేది. కానీ, మేం నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఆ దూరాన్ని మాయం చేసి, ఢిల్లీ ని ఈశాన్యం వాకిట్లోకి చేర్చాం.

సోదరీసోదరులారా, దేశ జనాభా లో ఇవాళ 65 శాతం 35 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారే. మన దేశ యువత మనకు గర్వకారణం. ఆర్థిక వ్యవస్థ ప్రమాణాలకు గల సకల నిర్వచనాలనూ మన యువతరం పూర్తిగా మార్చివేసింది. దేశ ప్రగతి ప్రమాణాలకు వారు కొత్త రంగులద్దారు. ఒకనాడు పెద్ద నగరాలకు మాత్రమే సదా గుర్తింపు ఉండేది. కానీ, ఇవాళ మన దేశం రెండో, మూడో అంచె నగరాల గురించి చర్చిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వ్యవసాయం లో నిమగ్నమైన యువతరంపై దృష్టి సారించింది. దేశంలో ఉద్యోగాల స్వభావాన్ని మన యువత సంపూర్ణంగా మార్చివేసింది. ఆ మేరకు స్టార్ట్- అప్ సంస్థలు, బిపిఒ లు, ఎలక్ట్రానిక్ వాణిజ్య (ఇ-కామర్స్) సంస్థలు, చలనశీలత వంటి కొత్త రంగాలను అన్వేషిస్తూ, వాటితో మమేకమవుతూ కొత్త శిఖరాలను అందుకుంటోంది.

ప్రియమైన నా దేశ వాసులారా.. దేశవ్యాప్తంగా 13 కోట్ల ముద్ర రుణాలు ఇవ్వడం ఓ ప్రధాన విజయం. అంతేకాకుండా స్వావలంబన ఆకాంక్ష తో మొదటి సారి రుణాలు పొందిన 4 కోట్ల మంది యువత స్వతంత్రోపాధి ని ప్రోత్సహిస్తోంది. తమ పర్యావరణం లో వారు ఈ మార్పు తేవడమే ఇందుకు తిరుగులేని నిదర్శనం. డిజిటల్ ఇండియా స్వప్న సాకారం దిశ గా కృషిలో ఇవాళ 3 లక్షల గ్రామాల్లో యువతీయువకులు అనేక సార్వత్రిక సేవా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ఠంగా వాడుకుంటూ ‘‘ఒక్క క్లిక్‌ తో-ముంగిట ప్రపంచం’’/‘‘ఏ వేళ.. ఎక్కడైనా అనుసంధానం’’ సేవలను ప్రతి గ్రామీణ పౌరుడికీ అందుబాటు లోకి తెచ్చారు.

ఇక మౌలిక సదుపాయాల విషయానికొస్తే- రైలు, రోడ్డు మార్గాలు, ఐ-వేలు, కొత్త విమానాశ్రయం వగైరాలు ఏవైనా కావచ్చు.. అత్యంత వేగంగా సాగుతున్న అభివృద్ధికి ప్రత్యక్ష సాక్ష్యాలు.

సోదరీ సోదరులారా, దేశ ప్రతిష్ఠ ను ఇనుమడింపజేయడంలో శాస్త్రవేత్తలు ఎనలేని కృషి చేశారు. అంతర్జాతీయంగా గాని, దేశ అవసరాలను తీర్చడంలో గాని మన శాస్త్రవేత్తలు మనకు గర్వ కారణంగా నిలిచారు. ఆ మేరకు ఏక కాలంలో 100కు పైగా ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రపంచమంతా లేచి నిలబడి, కరతాళ ధ్వనులతో అభినందన వర్షం కురిపించేలా చేయగలిగిన మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి అదో మచ్చుతునక. తొలి ప్రయత్నం లోనే మంగళ్ యాన్ ప్రయోగాన్ని విజయవంతం చేయగలగడమే వారి నైపుణ్యానికి, విశేష కృషి కి నిదర్శనం. మంగళయాన్ ఉప్రగ్రహ కక్ష్య ను మళ్లీ గాడి లో పెట్టడం కూడా మన శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని తేటతెల్లం చేసింది. మన శాస్త్రవేత్తల భవిష్యద్దర్శన శక్తి, ఆవిష్కరణ సామర్థ్యం, సృజనాత్మకత ఆలంబనగా రాబోయే రోజుల్లో ‘నావిక్’ (NavIC) పేరిట తొలి ‘స్వదేశీ భారత ప్రాంతీయ మార్గదర్శన ఉప్రగహ వ్యవస్థ’ (ఐఆర్ఎన్ఎస్ఎస్)ను విజయవంతంగా ప్రయోగించగలరన్న విశ్వాసం మనకుంది. ఈ మార్గదర్శన వ్యవస్థ మన మత్స్యకారులను, దేశ పౌరులను ఉపగ్రహ సంకేతాల ద్వారా నడిపిస్తుంది.

ప్రియమైన నా దేశ వాసులారా, ఈ రోజున ఎర్ర కోట బురుజుల మీది నుండి ఒక శుభ వార్త ను మీతో పంచుకోబోతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. అంతరిక్ష ప్రయోగాల్లో మన దేశం నిస్సందేహంగా ప్రగతిపథం లో దూసుకెళ్తోంది. అయితే, మనతో పాటు శాస్త్రవేత్తలూ ఓ కలగంటున్నారు. మన దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకునే 2022 నాటికి లేదా అంతకన్నా ముందుగానే- మన యువతీయువకులలో కొందరు అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేయాలని మనం సంకల్పం చెప్పుకొన్నాం. మన శాస్త్రవేత్తలు మంగళ్ యాన్ ప్రయోగాన్ని విజయవంతం చేసి తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యం లో మానవ సహిత అంతరిక్ష నౌక ప్రయోగం లో భాగంగా ఒక భారతీయుడిని అంతరిక్షం లోకి పంపబోతున్నామని ప్రకటించడానికి నేను ఎంతగానో గర్విస్తున్నాను. ప్రసిద్ధులైన మన శాస్త్రవేత్తల అవిరళ కృషి తో ఇది సుసాధ్యం కావడమే కాక మానవ సహిత అంతరిక్ష నౌక ను ప్రయోగించిన నాలుగో దేశం గా ఆ జాబితా లో మనం సగర్వంగా నిలుస్తాం.

ప్రియమైన సోదరీ సోదరులారా, అటువంటి గొప్ప విజయాన్ని సాధించబోయే మన శాస్త్రవేత్తలను, సాంకేతిక నిపుణులను నేను అభినందించదలచాను. ఇవాళ మన గిడ్డంగులు ఆహార ధాన్యాలతో నిండి ఉన్నాయి. ఈ సందర్భంగా దశాబ్దాల నుండి హరిత విప్లవాన్ని విజయవంతంగా నడిపించడంలో మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయదారులు, రైతులు పోషించిన భూమికను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

ప్రియమైన నా సోదరీ సోదరులారా, ఇప్పుడిక రోజులు మారాయి. మన రైతులు, వ్యవసాయ విపణులు అంతర్జాతీయ సవాళ్లను, పోటీ ని ఎదుర్కొనాల్సిన పరిస్థితి వచ్చింది. జనాభా పెరిగే కొద్దీ భూమి కొరత ఏర్పడుతుంది. అందుకే మన వ్యవసాయ పద్ధతులు కూడా మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా మారాల్సిన అవసరం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఈ ప్రక్రియ ను మనం ముందుకు తీసుకుపోవాలి. కచ్చితంగా ఇందుకోసమే వ్యవసాయ రంగంలో మార్పులపై దృష్టి సారించి, అత్యాధునిక పద్ధతులను ప్రవేశపెట్టేందుకు కృషిచేస్తున్నాం.

ఆ మేరకు మన 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే భవిష్యత్ వ్యూహాన్ని నిర్దేశించుకున్నాం. దీనిపై కొందరికి సందేహాలు ఉండటం సహజమే.. కానీ, మేం మాత్రం కృతనిశ్చయంతో ఉన్నాం. ‘‘మా మాటలు వెన్నపూస మీద గీతలు కావు... రాతి మీద రాసిన వాగ్దానాలు.’’ ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి చాలా ప్రణాళికలను రచించుకుని త్రికరణ శుద్ధి (మనసా, వాచా, కర్మణా)గా అహోరాత్రాలు శ్రమించవలసివుంది. కాబట్టి 75వ స్వాతంత్ర్య దినోత్సవం కల్లా ఈ వాగ్దానం రూపుదాల్చే దిశగా వ్యవసాయ రంగంలో ఆధునికతను, వైవిధ్యాన్ని ప్రవేశపెట్టి, రైతులతోపాటు ముందుకు సాగాలి. ‘విత్తు నుండి విక్రయం’దాకా విలువ జోడింపు ను ప్రవేశపెట్టాలన్నది మా అభిలాష. తదనుగుణంగా మనకు ఆధునికత అవశ్యం. కొన్ని కొత్త పంటలు రికార్డు స్థాయి దిగుబడులిస్తున్నాయి. మన రైతులు కూడా అంతర్జాతీయ స్పర్ధను ఆత్మ విశ్వాసం తో ఎదుర్కొనగలిగేలా తొలిసారిగా మేం వ్యవసాయ ఎగుమతుల విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. నేడు మనం ఓ సరికొత్త వ్యవసాయ విప్లవాన్ని చూస్తున్నాం.. ఇందులో భాగంగా సేంద్రియ సాగు, నీలి విప్లవం, మధుర విప్లవం, సౌర సాగు (సూర్యరశ్మితో విద్యుదత్పాదన) వంటి కొత్త మార్గాలు ఆవిష్కృతమవుతున్నాయి.

నేడు మన దేశం చేపల ఉత్పత్తి లో ప్రపంచం లోనే రెండో స్థానంలో ఉండడం గొప్ప సంతృప్తిని ఇచ్చే అంశం. కాగా, త్వరలోనే ఇందులో ప్రథమ స్థానాన్ని అందుకోనున్నామన్నది మరింత శుభ వార్త. తేనె ఎగుమతి రెట్టింపైంది. అలాగే ఇథెనాల్ ఉత్పాదన మూడింతలు కావడం మన చెరకు రైతులను సంతోషభరితులను చేస్తోంది. అంటే... గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానుబంధ ఇతర వ్యాపారాలు కూడా వ్యవసాయంతో సమాన ప్రాముఖ్యం గలవిగా రూపొందుతున్నాయి. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ వనరులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయల మేర నిధులను వెచ్చిస్తోంది.

ఖాదీ ఉత్పత్తులు గౌరవనీయులైన బాపూ జీ పేరు తో ముడిపడి ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటికి ఖాదీ ఉత్పత్తుల విక్రయాలు రెట్టింపయ్యాయని ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. దీనివల్ల పేదలకు ఉపాధి కల్పన సాధ్యమైంది.

నా సోదరీ సోదరులారా.. నా దేశ రైతులు ఇవాళ సౌర సాగు (సౌర విద్యుదత్పాదన) కు ప్రాధాన్యం ఇస్తున్నారు. సౌర శక్తి తో వ్యవసాయం చేయడంతో పాటు సౌరసాగు ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ విక్రయం తో వారు అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు. చరఖా తిప్పే వారు, చేనేత తో ముడిపడిన వారు కూడా వారి జీవనోపాధిని పొందగలుగుతున్నారు.

ప్రియమైన నా సోదరీ సోదరులారా, మన దేశంలో ఆర్థికాభివృద్ధి ముఖ్యమే గానీ, మానవత కు గౌరవం అన్నిటి కన్నా ఎక్కువ. అది లేనినాడు ఏ దేశమూ సమతూకంతో ముందుకుపోవడం అసాధ్యం. కాబట్టి మానవతా గౌరవ పరిరక్షణ కోసం ప్రజల సగౌరవ జీవితానికి భరోసానిచ్చే పథకాలతో మనం పురోగమించవలసి వుంది. పేదల్లో నిరుపేదలు సహా సామాన్యులందరూ సమాన గౌరవంతో జీవించే అవకాశం లభించాలంటే మన విధానాలు, సంప్రదాయాలు, ఉద్దేశాలు కూడా అందుకు అనుగుణమైనవిగానే ఉండాలి.

అందుకే మేం ‘ఉజ్వల యోజన’ ద్వారా పేదలకు గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చాం. ‘సౌభాగ్య యోజన’ ద్వారా విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. ‘శ్రమయేవ జయతే’ నినాదం స్ఫూర్తి తో ముందుకుపోవడానికి ప్రాధాన్యమిస్తున్నాం.

నిన్ననే మనం దేశ ప్రజలను ఉద్దేశించిన రాష్ట్రపతి చేసిన ప్రసంగాన్ని విన్నాం. గ్రామ స్వరాజ్ అభియాన్ ను గురించి ఆయన సవివరంగా తెలిపారు. ప్రభుత్వ పాలన ను గురించి ఎప్పడు ప్రస్తావన వచ్చినా విధానాలు రూపొందుతాయే తప్ప దేశంలో చివరి మనిషి దాకా అవి అందవన్న మాట వినిపిస్తూంటుంది. అయితే, ఢిల్లీ లో మొదలైన పథకాలన్నీ ఆకాంక్ష భరిత జిల్లాల్లోని 65వేల గ్రామాలకు.. పేదల పూరిళ్లదాకా ఏ విధంగా చేరిందీ, వెనుకబడిన గ్రామాలకు అవి ఎంత ప్రయోజనకరమన్నదీ కూడా రాష్ట్రపతి కూలంకషంగా వివరించారు.

ప్రియమైన నా దేశ వాసులారా, పరిశుభ్రత ను గురించి 2014 లో నేను ఎర్ర కోట బురుజుల మీది నుండి మాట్లాడినప్పుడు కొందరు హేళనగా నవ్వుకున్నారు. మరికొందరైతే- ప్రభుత్వం చేయాల్సినవి ఎన్నో ఉండగా, పరిశుభ్రత వంటి సమస్యపై తన శక్తిని ఎందుకు వృథా చేయాలనుకుంటోందని సందేహాస్పదంగా వ్యాఖ్యానించారు. కానీ, ప్రియమైన నా సోదరీసోదరులారా.. పరిశుభ్రతపై ఉద్యమం వల్ల దేశంలో మూడు లక్షల మంది పిల్లలు రక్షించబడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ ఒ) ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ ఉద్యమం లో పాలుపంచుకున్న భారతీయులందరికీ ఈ మూడు లక్షల మంది పేద పిల్లల ప్రాణాలు రక్షించిన ఘనత దక్కుతుంది. ఇది చాలా గొప్ప మానవీయ కార్యం... కనుకనే అంతర్జాతీయ సంస్థలు కూడా దీన్ని గుర్తించాయి.

సోదరీ సోదరులారా.. వచ్చే ఏడాది మహాత్మ గాంధీ 150వ జయంతి. బాపూ జీ తన జీవిత కాలం లో స్వాతంత్ర్యం కన్నా కూడా పరిశుభ్రతకే అధిక ప్రాధాన్యమిచ్చారు. మనం సత్యాగ్రహుల త్యాగం, స్వచ్ఛత (పరిశుభ్రత)ల తోనే స్వాతంత్ర్యం తెచ్చుకోగలిగామని ఆయన చెబుతూండే వారు. ఆ స్వచ్ఛత ‘స్వచ్ఛాగ్రహుల’ నుండి వస్తుంది. గాంధీ జీ సత్యాగ్రహులను తయారుచేసిన స్ఫూర్తే స్వచ్ఛాగ్రహులను తయారు చేసేందుకు మాకు ప్రేరణనిచ్చింది. రాబోయే రోజుల్లో గాంధీ గారి 150వ జయంతి వేడుకలు చేసుకునే సమయానికి కోట్లాది స్వచ్ఛాగ్రహులు మహాత్ముని స్మరిస్తూ ‘కార్యాంజలి’ (పనికి అంకితం) ఘటిస్తారు. ఒక విధంగా మేం వాస్తవం చేస్తున్న ఆయన కలలను వారు సాకారం చేస్తారు.

నా సోదరీ సోదరులారా, పరిశుభ్రత వల్ల మూడు లక్షల మంది పిల్లల జీవితాలు రక్షించబడ్డాయన్నది వాస్తవం. అయితే, మధ్యతరగతి కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నా.. దేనికీ లోటు లేనిదిగా ఉన్నా.. ఎంత పేద వారైనా కుటుంబ సభ్యులలో ఒకరికి ఆరోగ్యం బాగా లేని పక్షంలో మొత్తం కుటుంబం బాధపడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో తరతరాలూ వ్యాధిపీడితమవుతాయి.

అందుకే ‘ప్రధాన మంత్రి జనారోగ్య అభియాన్’ను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా పేదలు, సామాన్యులు తీవ్ర వ్యాధుల పాలైనప్పుడు పెద్ద ఆసుపత్రులలో ఉచిత వైద్యం పొందగలుగుతారు. ప్రధానమంత్రి జనారోగ్య అభియాన్, ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ లో భాగంగా దేశం లోని 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా లభిస్తుంది. రాబోయే రోజుల్లో దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఆదాయవర్గాల వారు కూడా ఈ రెండు ఆరోగ్య సంరక్షణ పథకాల ద్వారా వైద్యసేవలను పొందగలుగుతారు. ప్రతి కుటుంబానికి ఏటా 5 లక్షల రూపాయల వంతున ఆరోగ్య హామీ ఇవ్వబడుతుంది. అంటే.. కుటుంబానికి సగటున ఐదుగురు సభ్యులున్నా 50 కోట్ల మంది పౌరులకు తీవ్ర వ్యాధుల బారిన పడిన పక్షంలో 5 లక్షల రూపాయల విలువైన ఉచిత చికిత్స అందుతుంది. ఇది సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటు తో పారదర్శకంగా నడిచే వ్యవస్థ. కేవలం దీనికోసమే ఉద్దేశించిన సాంకేతికత, సాంకేతిక ఉపకరణాల ద్వారా ఇది పూర్తి పారదర్శకంగా నిర్వహించబడుతుంది గనుక సామాన్య పౌరులకైనా ఎలాంటి ఇబ్బందులు కలగవు.

ఈ సాంకేతిక పరిజ్ఞానం లోపరహితమన్న నిర్ధారణ కోసం ఇవాళ్టినుండి రాబోయే నాలుగు, ఐదు, ఆరు వారాల్లో దేశవ్యాప్తంగా పరీక్షించి చూస్తాం. అటుపైన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంత్రి సందర్భంగా సెప్టెంబరు 25వ తేదీ నాడు ఈ పథకాన్ని దేశమంతటా ప్రారంభిస్తాం. దేశంలో ఏ ఒక్క పేద వ్యక్తీ వ్యాధులతో బాధపడే పరిస్థితి రాకూడదు. వచ్చినా, వ్యాపారుల వద్ద వడ్డీకి అప్పులు చేసే పరిస్థితి అంతకన్నా ఉండకూడదు. వారి కుటుంబం నాశనమై పోరాదు. ప్రధానమంత్రి జనారోగ్య అభియాన్, ఆయుష్మాన్ భారత్ యోజన ఈ లక్ష్యాన్ని విజయవంతంగా అందుకోగలవు. ఇక వీటివల్ల ఆరోగ్య రంగంలోని యువతకు, మధ్య తరగతి కుటుంబాలకు కొత్త ఉపాధి మార్గాలు అందుబాటులోకి వస్తాయి. రెండో అంచె నగరాల్లో, మూడో అంచె నగరాల్లో కొత్త ఆసుపత్రులు నిర్మితమవుతాయి. వాటికి పెద్ద సంఖ్య లో వైద్య సిబ్బంది అవసరం కాబట్టి అధిక సంఖ్య లో ఉద్యోగాల సృష్టి కీ అవకాశం ఉంది.

సోదరీ సోదరులారా, ఏ పేదవాడూ పేదరికంలో జీవించాలనుకోడు. ఏ నిరుపేదా దారిద్ర్యం లోనే మరణించాలని భావించడు. ఏ పేద వ్యక్తీ తన పేదరికాన్ని తన పిల్లలకు వారసత్వంగా సంక్రమింపజేయాలని అనుకోడు. బీదరికం నుండి బయటపడేందుకు జీవితాంతం సంఘర్షిస్తాడు. ఈ సమస్య ను అధిగమించగల మార్గం- పేదల ప్రజలకు సాధికారిత కల్పన ఒక్కటి మాత్రమే.

గడచిన నాలుగు సంవత్సరాలలో పేదల సాధికారిత కల్పన కు మేం అత్యధిక ప్రాధాన్యాన్నిచ్చాం. పేదలకు సాధికారితే లక్ష్యంగా కఠోర పరిశ్రమ చేశాం. ఇటీవలే ఒక అంతర్జాతీయ సంస్థ చాలా మంచి నివేదిక ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం... గడచిన రెండు సంవత్సరాల వ్యవధి లోనే 5 కోట్ల మంది పేద ప్రజలు దారిద్ర్య రేఖను అధిగమించారు.

సోదరీ సోదరులారా,

మేం పేదల సాధికారితను గురించి ప్రత్యేకించి నేను ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని గురించి ప్రస్తావించినప్పుడు ఆ పథకం ఎంత భారీగా ఉంటుందో కొద్ది మంది మాత్రమే ఊహించారు. 10 కోట్ల కుటుంబాలు, 50 కోట్ల ప్రజలు దాని యొక్క ప్రయోజనాన్ని పొందుతారని కొద్ది మంది మాత్రమే గుర్తించారు. మనం అమెరికా, కెనడా, మెక్సికో ల జనాభా ను కలిపి తీసుకుంటే ఎంత ఉంటుందో ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల సంఖ్య అంత ఉంటుంది. యూరోప్ జనాభా ఎంత ఉంటుందో అంత మంది ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల ప్రయోజనం పొందుతారు.

సోదరీ సోదరులారా, పేదల సాధికారిత కోసం మేం పలు ప‌థ‌కాలను రూపొందించాం. గ‌తంలో కూడా చాలా ప‌థ‌కాలు రూపొందినా మ‌ధ్య‌ద‌ళారీలు అడ్డుప‌డి వాటిలోని సారాన్ని అంతా తామే తీసుకునే వారు. ఒక హ‌క్కుగా త‌మ‌కు ఏదైతే ల‌భించాల్సి ఉంటుందో అది పేద ప్ర‌జ‌లు పొంద‌లేక‌పోయారు. సొమ్ముని ఖ‌జానా భ‌రించేది, పథకాలు కాగితాలలోనే ఉండిపోయేవి, దేశం య‌థాప్ర‌కారం దోపిడికి గుర‌వుతూనే ఉండేది. ప్ర‌భుత్వం క‌ళ్లు మూసుకుని కూర్చోలేదు. క‌నీసం నా వ‌ర‌కు నేను ఇలాంటి దుశ్చ‌ర్యల కోసం క‌ళ్లు మూసుకుని ఉంచుకోను.

సోదరీ సోదరులారా, అందుకే ఇలాంటి లోపాలన్నింటినీ తొలగించి సగటు జీవిలో విశ్వాసాన్ని కల్పించడం అత్యంత ప్రధానం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, స్వయంపాలన చేసుకునే స్థానిక సంస్థలు కావచ్చు.. అన్ని చోట్లా మనందరం కలిసికట్టుగా పని చేయాలి. బోగస్ ల ఏరివేత కార్యక్రమం మేం చేపట్టిన నాటికి ఆరు కోట్ల మంది బోగస్ లబ్ధిదారులు వ్యవస్థ లో ఉన్నారు. కానీ వారు అసలు పుట్టిన దాఖలాలు గాని, ఈ భూమి మీద జీవిస్తున్న ఆనవాలు గాని లేనే లేవు. అలా ఈ భూమి పైనే ఆచూకీ లేని వారి పేరు మీద సొమ్ము బదిలీ అయేది. ఉజ్వల పథకం కావచ్చు, గ్యాస్ కనెక్షన్ లు కావచ్చు, పింఛను పథకం కావచ్చు, ఉపకార వేతనం కావచ్చు... ప్రతి ఒక్క దాని లోనూ పేరు కోసం ఎవరో ఒకరు లబ్ధిదారులుగా కనిపించే వారు, లాభాన్ని మాత్రం ఇతరులు పొందే వారు. ఆరు కోట్ల నకిలీ పేర్లను తొలగించడం ఎంత కష్టమో మీరే ఆలోచించండి. ఇ లాంటి పనుల వల్ల ఎంత మంది ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటారు? అసలు ఈ భువిపై పుట్టనే పుట్టని మనిషి, అసలు ఈ భూగ్రహం మీదనే ఎక్కడా అస్తిత్వం కనిపించని మనుషుల పేర్ల మీద బోగస్ గుర్తింపులతో ధనం దుర్వినియోగం అయ్యేది. మా ప్రభుత్వం దానికి స్వస్తి పలికింది. అవినీతి నిర్మూలన, వ్యవస్థ నుండి నల్లధనం తొలగింపు దిశగా మేం చర్యలు తీసుకున్నాం.

సోదరీ సోదరులారా, దాని ప్రభావం ఏమిటి? 90 వేల కోట్ల రూపాయలు చిన్న మొత్తం ఏమీ కాదు. అక్రమ కార్యకలాపాల ద్వారా అక్రమ ఆర్జనపరుల చేతుల్లోకి దాదాపుగా 90 వేల కోట్ల రూపాయలు వెళ్లేది. ఆ సొమ్ము అంతా ఈ రోజున సర్కారు ఖజానా లో భద్రంగా ఉంది. దీనిని సామాన్య మానవుల కోసం ఉద్దేశించినటువంటి సంక్షేమ చర్యలకు ప్రభుత్వం వినియోగిస్తోంది.

సోదరీ సోదరులారా, అది ఎలా సాధ్యపడింది? పేద ప్రజల ఆత్మ గౌరవం కోసం మన దేశం పని చేస్తుంది. కానీ ఈ మధ్యదళారీలు ఏం చేస్తారు? విపణి లో కిలో గోధుమ 24 నుంచి 25 రూపాయల ధరకు అమ్ముతారన్న విషయం మీకందరికీ తెలుసు. ఆ ధర కు ప్రభుత్వం కొనుగోలు చేసి, రేషన్ కార్డుపైన ప్రజలకు కేవలం రెండు రూపాయల ధరకు అందిస్తుంది. అదే విధంగా బియ్యం మార్కెట్ ధర కిలో 30-32 రూపాయలు ఉంటే, రేషన్ కార్డుపైన ప్రజలకు కేవలం మూడు రూపాయలకే అందిస్తుంది. అయితే ఎవరైనా బోగస్ రేషన్ కార్డు మీద ఒక కిలో గోధుమ లేదా బియ్యం కొనుగోలు చేస్తే 20-25 రూపాయలు, 30-35 రూపాయలు వారి జేబు లోకి చేరుతుంది. బోగస్ గుర్తింపు కార్డులు, బోగస్ పేర్ల వ్యాపారం అంతా అలాగే సాగింది. ఒక పేద తరగతి వ్యక్తి కార్డు మీద వస్తువులు కావాలని రేషన్ దుకాణదారును అడిగితే నిల్వ లేదనే సమాధానమే వచ్చేది. ఆ ఆహారధాన్యాలన్నీ వేరే దుకాణానికి మరలిపోయేవి. రెండు రూపాయలకు తమకు దక్కాల్సిన గోధుమలను పేదలు 20-25 రూపాయలు పెట్టి మార్కెట్ నుండి కొనుక్కోవాల్సి వచ్చేది. ప్రజల హక్కులను ఆ రకంగా అపహరించే వారు. అందుకే ఆ బోగస్ వ్యవస్థ ను కూకటి వేళ్ల తో సహా తొలగించాం.

సోదరీ సోదరులారా, కోట్లాది మంది ప్రజలు కిలో రెండు రూపాయలు, మూడు రూపాయల ధరకే ఆహార ధాన్యాలను పొందుతున్నారు. వారి కోసం ఎంతో ఉదారంగా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. కానీ ఆ ఘనత కేవలం ప్రభుత్వానిది కాదు. ఈ రోజున నేను ఒక విషయాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను.. మీరు కుటుంబం తో కలసి ఆహారాన్ని తీసుకోగలుగుతున్నారంటే అది నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారుల పుణ్యమే. అలాంటి నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారులకు నేను అభివాదం చేస్తున్నాను. నా మాటలతో వారి హృదయాలను స్పర్శించాలనుకొంటున్నాను. ఆ పన్ను చెల్లింపుదారులందరికీ నేను అభివాదం చేస్తున్నాను. ఈ పథకాలన్నీ మీరు ఇచ్చిన సొమ్ము వల్లనే నడపగలుగుతున్నాం అని మరోసారి దృఢంగా చెబుతున్నాను. పేదలు నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారుల సొమ్ము సహాయం తోనే కడుపు నిండా తింటున్నారంటే ఆ పుణ్యం, దాని ఫలితం ఆ పన్ను చెల్లింపుదారులకే చేరుతుంది. మీరు మీ కుటుంబంతో కలసి ఆహారం తీసుకుంటున్న సమయంలోనే సమాంతరంగా మూడు పేద కుటుంబాలు మీరు పన్నుల రూపేణా కట్టిన సొమ్ము అందించిన లబ్ధితో ఆహారం తీసుకోగలుగుతున్నారు.

మిత్రులారా, పన్నులను చెల్లించకుండా ఎగవేసే రోజులు ఒకప్పుడు ఉండేవి. కానీ ఎసి గది లో కూర్చొని వుండే అదే వ్యక్తి కి తాను పన్నుగా చెల్లిస్తున్న సొమ్ము తో మూడు పేద కుటుంబాలకు భుక్తి కలుగుతోందంటే ఎంత సంతృప్తి గా ఉంటుంది. ఒక మనిషి చేపట్టగదిన పెద్ద పని ఇదే. సోదరీ సోదరులారా, ఈ రోజున నిజాయతీ కి పట్టం కట్టే దిశగా దేశం కదులుతోంది. 2013 వరకు 70 సంవత్సరాల సుదీర్ఘ దేశ చరిత్ర లో నాలుగు కోట్ల మంది మాత్రమే ప్రత్యక్ష పన్నుచెల్లింపుదారులే ఉండే వారు. కానీ ఈ రోజున వారి సంఖ్య 6.75 కోట్లకు చేరింది. అంటే 3.5 లేదా 3.75 కోట్ల నుంచి మనం ఎంత త్వరితంగా 6.75 కోట్లకు చేరామో మీరే గమనించండి. ఈ గణాంకాలు చరిత్ర కు దర్పణం పట్టడం లేదా? దేశం నిజాయతీ వైపు కదులుతోంది అనేందుకు ఇంత కన్నా ఆశ్చర్యకరమైన నిదర్శనం ఏమి కావాలి? 70 సంవత్సరాల కాలంలో 70 లక్షల కంపెనీలే నమోదయ్యాయి. అయితే జిఎస్ టి ని ప్రవేశపెట్టిన తరువాత వాటి సంఖ్య 1.16 కోట్లకు చేరింది. సోదరీ సోదరులారా, ఈ రోజున దేశం యావత్తు నిజాయతీకి శిరస్సును వంచి అభివాదం చేస్తోంది. పారదర్శకతకు, నిజాయతీ అనుసరిస్తున్న వారందరికీ నేను అభివాదం చేస్తున్నాను. మీరంతా జాతి పురోగతి కి మీ వంతు వాటా ను అందిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. మీ సమస్యల పట్ల మేం ఆవేదన చెందుతున్నాం. మీమంతా మీ వెంటే ఉన్నాం. ప్రతి ఒక్కరి వాటా తోనే దేశాన్ని ముందుకు పురోగమింపచేస్తాం. అందుకే నల్లధనం, అవినీతి రెండింటినీ మేం ఏ మాత్రం సహించం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మనం నిజాయతీయుతమైన బాట నుండి తప్పుకోకూడదు. అవి మన జాతి ని ఎంత కుంగదీశాయో, ఎంత వినాశం చేశాయో మనందరం చూశాం. అయితే ఈ రోజున అధికారులను ముగ్గు లోకి దింపే దళారులు ఢిల్లీ వీధుల్లో ఎక్కడా కనిపించరు.

ప్రియమైన దేశ వాసులారా, కాలం ఎంతో మారింది. ఎవరో కొద్ది మంది తమ అతిథి గృహ‌ంలో కూర్చొని ప్రభుత్వ విధానాలను మేం మార్చగలం, ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలం అనే రోజులు పోయాయి. వారంతా మౌనంగా మారిపోయారు. వారికి మా తలుపులు మూసుకుపోయాయి.

ప్రియమైన దేశ వాసులారా, ఆశ్రిత పక్షపాతం, కొందరికి కొమ్ము కాయడం వంటివి మేం మూలం తో సహా నిర్మూలించేశాం. ఒకరి వైపు మొగ్గు చూపించడం, సన్నిహితులకు మేలు చేయడం వంటి ధోరణులను మేం దృఢంగా ఖండిస్తున్నాం. మూడు లక్షలకు పైగా నకిలీ కంపెనీలను మూసివేయించాం. వాటి డైరెక్టర్ల మీద పరిమితులు విధించాం. పారదర్శకత కోసం ఐటి విభాగం లో ఆన్ లైన్ లావాదేవీలను మేం ప్రవేశపెట్టాం. ఒకప్పుడు పర్యావరణ అనుమతులు పొందాలంటే భారీ అవినీతి తో కూడుకున్న వ్యవహారం అనే స్థితి ఉండేది. మేం దాన్ని కూడా ఆన్ లైన్ లోకి మార్చి, పారదర్శకత్వాన్ని తీసుకు వచ్చాం. దీనిలోకి ఏ వ్యక్తి అయినా ప్రవేశించవచ్చును. దేశ వనరులను న్యాయబద్ధంగా ఉపయోగించుకోగల మార్గం లో మేం పని చేస్తున్నాం. ఈ రోజున దేశానికి న్యాయాన్ని అందించే అత్యున్నతమైన న్యాయ స్థానం లో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారన్నది అత్యంత గర్వకారణమైనటువంటి విషయం. దేశ చరిత్ర లోనే తొలి సారి గా కేంద్ర మంత్రివర్గం లో గరిష్ఠ సంఖ్యలో మహిళల భాగస్వామ్యం ఉంది.

ప్రియమైన దేశ వాసులారా, ఈ రోజున నేను ఒక అద్భుతమైన విషయాన్ని సాహసవంతులైన నా కుమార్తెలతో చెప్పాలనుకుంటున్నాను.. భారత సాయుధ దళాలకు చెందిన షార్ట్ సర్వీస్ కమిశన్ లో మహిళల నియామకాల కోసం ఒక శాశ్వత కమిశన్ ను ఏర్పాటు చేయునున్నట్టు గర్వంగా ప్రకటిస్తున్నాను. పురుష అధికారుల నియామకం ప్రక్రియ ఎంత సరళంగా ఉంటుందో ఇక్కడ కూడా నియామక ప్రక్రియ అంతే సరళంగా, పారదర్శకంగా ఉంటుంది. యూనిఫార్మ్ డ్ దళాల్లో పని చేస్తూ జాతి సేవ కే జీవితాలను అంకితం చేసిన కుమార్తెలందరికీ ఈ ఎర్ర కోట నుండి నేను అందిస్తున్నటువంటి కానుక ఇదే. మన జాతికే గర్వకారణం అయిన ఈ బాలికల దేశసేవా కట్టుబాటుకు, సాహసానికి జాతి యావత్తు శిరస్సును వంచి అభివాదం చేస్తోంది. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం లో మహిళలు కూడా సమానంగా వాటా అందిస్తున్నారు. మన మాతృమూర్తులు, సోదరీమణుల సామర్థ్యాలు, వారందిస్తున్న వాటా జాతి మొత్తం గుర్తించింది.

వ్యవసాయ రంగం నుంచి క్రీడల వరకు భారత త్రివర్ణ పతాకను మహిళలే ఉన్నత శిఖరాల్లో నిలుపుతున్నారు. సర్పంచ్ నుండి పార్లమెంటు స్థాయి వరకు మహిళలు దేశాభివృద్ధికి వారి వంతు వాటా ను అందిస్తున్నారు. పాఠశాలల నుండి సాయుధ దళాల వరకు మహిళలే దేశాన్ని ముందుకు నడపడం లో ముందు వరుస లో నిలుస్తున్నారు. మహిళలు ఇంత భారీ సంఖ్య లో సాహసోపేతంగా ముందుకు కదులుతున్న ఈ రోజుల్లో కూడా మనకు అత్యంత క్రూరమైన కోణం కూడా ఒకటి దర్శనం ఇస్తోంది. రాక్షస ప్రవృత్తి గల కొన్ని శక్తులు మహిళా శక్తి కి సవాలు విసురుతున్నాయి. అత్యాచారం అత్యంత బాధాకరం, దాని వల్ల బాధితులు అనుభవిస్తున్న బాధను, వ్యధను దేశం యావత్తు కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలి. సోదరీ సోదరులారా, రాక్షస ప్రవృత్తి నుండి దేశాన్ని స్వేచ్ఛాయుతం చేశాం. చట్టం ఆ కేసుల విషయం లో తన పని ని తాను చేసుకు పోతుంది. కొద్ది రోజుల క్రితమే మధ్య ప్రదేశ్ లోని కట్ని లో అత్యాచారం కేసులో రేపిస్టులకు ఐదే ఐదు రోజుల విచారణ అనంతరం ఉరిశిక్ష పడింది. అదే విధంగా రాజస్తాన్ లో కూడా ఒక అత్యాచారం కేసులో నిందితులకు తక్కువ సమయం లోనే విచారణ ను ముగించి ఉరిశిక్ష విధించారు. అలాంటి వార్తలను ప్రముఖంగా ప్రచురించాలి. రాక్షస ప్రవృత్తి గల వారంతా జడుసుకోవాలి. రేపిస్టులను ఉరికంబం ఎక్కిస్తున్నారన్న విషయం ప్రజలకు తెలిసేలా అలాంటి వార్తలకు ప్రచారం కల్పించాలి. సోదరీ సోదరులారా, రాక్షస ప్రవృత్తి మనిషిని అనేక నేరాలకు ఉసి గొల్పుతోంది. దేశీయ చట్టాలే మనకు శిరోధార్యం, వాటి విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. చట్టం చేతుల్లోకి తీసుకొనే అవకాశాన్ని ఏ ఒక్కరికీ ఇవ్వకూడదు. నవతరానికి చెందిన బాల బాలికలు అందరి లోనూ విలువలు నేర్చుకుని ఆచరణలో పెట్టగల రీతిలో కుటుంబాలలో, పాఠశాలల్లో, కళాశాలల్లో మానవీయ విలువలను గురించి బోధించాలి. మహిళలను గౌరవించడాన్ని వారు నేర్చుకోవాలి. మన కుటుంబాల్లో ఈ భావనను, విలువలను అలవరచాలి.

సోదరీ సోదరులారా, మూడు సార్లు తలాక్ చెప్పి వదిలించుకునే ఆచారం ముస్లిమ్ కుమార్తెల జీవితాలను నాశనం చేస్తోంది. అలా తలాక్ చెప్పించుకోకుండా ఆ దురాచారానికి వెలుపల ఉన్న వారు కూడా జీవితాలను ఎంతో ఒత్తిడి తో గడుపుతున్నారు. ఈ దురాగతం బారి నుండి వారికి విముక్తి ని కల్పించేందుకు వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు లో చట్టం చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తే ఆ బిల్లు ఆమోదం పొందకుండా ఇప్పటికీ కొందరు అడ్డు పడుతున్నారు. మీకు న్యాయం జరిగే వరకు నేను విశ్రమించబోనని ముస్లిమ్ మాతృమూర్తులకు, సోదరీమణులకు, కుమార్తెలకు మరోసారి నేను హామీ ఇస్తున్నాను. వారి ఆశలన్నింటినీ నేను సాకారం చేస్తాను.

ప్రియమైన నా దేశ ప్రజలారా, మన సాయుధ దళాలు, అర్ధసైనిక బలగాలు, పోలీసు సిబ్బంది, గూఢచారి వ్యవస్థ లు దేశ అంతర్గత భద్రత కు ఎనలేని శక్తిని అందిస్తున్నాయి. వారంతా మనందరిలోనూ ఒక రకమైన భద్రతా భావాన్ని కల్పిస్తున్నారు. శాంతియుత వాతావరణానికి హామీ ఇస్తున్నారు. వారి త్యాగాలు, కట్టుబాటు, కఠోర శ్రమ ఒక కొత్త రకమైన విశ్వాసాన్ని మనకు అందించాయి.

సోదరీ సోదరులారా, అప్పుడప్పుడు ఈశాన్య ప్రాంతాల నుండి హింసాత్మక సంఘటనలు మనకు తారసపడుతూ ఉంటాయి. తిరుగుబాట్లు, బాంబు పేలుళ్లు, కాల్పులు వంటి వార్తలు మన చెవిన పడుతూ ఉంటాయి. కానీ ఈ రోజున మూడు, నాలుగు దశాబ్దాల నుండి అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్ ఎస్ పిఎ) నుండి మేఘాలయ, త్రిపుర లు విముక్తి ని పొందాయి. మన సాయుధ దళాలు, రాష్ట్ర ప్రభుత్వాల కార్యశీలతే ఇందుకు కారణం. ఆ రాష్ట్రాల ప్రజలను జాతి జీవన స్రవంతి లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో కూడా ఈ చట్టం అమలులో ఉండేది. ఈ రోజున కొద్దిపాటి జిల్లాలు మాత్రమే దాని పరిధిలో ఉన్నాయి.

వామపక్ష తీవ్రవాదం, మావోయిజం దేశం లో రక్తాన్ని చిందిస్తున్నాయి. దౌర్జన్యకర సంఘటనలకు భయపడి ప్రజలు ఇళ్ల నుండి పారిపోయి అడవులలో దాక్కోవడం అక్కడ పరిపాటి. భద్రత దళాల అవిశ్రాంత కృషి, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల వామపక్ష తీవ్రవాద పీడిత జిల్లాల సంఖ్య 120 నుండి 90 కి తగ్గింది. ఆయా జిల్లాల్లో వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు సరైన పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం వేగంగా సాగుతోంది.

సోదరీ సోదరులారా, జ‌మ్ము & క‌శ్మీర్ స‌మ‌స్య‌కు అట‌ల్ బిహారీ వాజ్ పేయీ గారు చూపించిన మార్గ‌మే స‌రైన మార్గం. అదే మార్గంలో మేం ముందుకు సాగాల‌నుకుంటున్నాం. జ‌మ్ము & క‌శ్మీర్ ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించ‌డం కోసం తాము ఇన్సానియ‌త్, జమూరియ‌త్, క‌శ్మీరియ‌త్ (మానవత్వం, ప్ర‌జాస్వామ్యం, క‌శ్మీరియ‌త్) బాట‌నే అనుస‌రిస్తామ‌ని వాజ్ పేయీ గారు చెప్పారు. ఒక స‌గ‌టు జీవి ఆకాంక్ష‌లు నెర‌వేరగల, మౌలిక వ‌స‌తులు ప‌టిష్ఠం కాగల స‌మ‌తూక‌మైన అభివృద్ధికే మేం ప్రాధాన్యాన్ని ఇస్తాం. మా హృద‌యాల్లో సౌభ్రాతృత్వాన్ని నింపుకొని మేం ముందుకు పోతాం. తూటాలు, దురాగ‌తాల బాట‌ లో ప‌య‌నించే ఆస్కార‌మే లేదు. దేశ‌ భ‌క్తి ప్ర‌పూరితులై మన వెంట నిలచిన క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌ను ప్రేమాభిమానాల‌తో అక్కున చేర్చుకుంటాం.

సోదరీ సోదరులారా, నీటి పారుదల పథకాలు చురుకుగా అమలు జరుగుతున్నాయి. ఐఐటిలు, ఎఎఎమ్ లు, ఎఐఐఎమ్ ఎస్ ల నిర్మాణం చురుకుగా సాగుతోంది. దాల్ సరస్సు పునరుద్ధరణ పని జరుగుతోంది. జ‌మ్ము & క‌శ్మీర్ కు చెందిన గ్రామ పెద్దలు గత సంవత్సర కాలంగా తరచుగా నాతో భేటీ అవుతూ పంచాయతీ ఎన్నికలను నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదో ఒక కారణంగా పంచాయతీ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. రానున్న నెలల్లో అక్కడ గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. తమ గ్రామాలను తామే చూసుకోగల స్థితి కల్పించే వ్యవస్థ ను గ్రామ ప్రజలకు త్వరలోనే సిద్ధం చేసి అందచేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు భారీ పరిమాణం లో నిధులను నేరుగా గ్రామాలకే అందిస్తోంది. దీని వల్ల గ్రామ పెద్దలు వారి గ్రామాలను అభివృద్ధి పథం లో నడిపించగలుగుతారు. ఈ లక్ష్యం తోనే గ్రామ పంచాయతీలకు, నగర కౌన్సిళ్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నాం.

సోదరీ సోదరులారా, దేశాన్ని కొత్త శిఖరాలకు మనం నడిపించవలసివుంది. “సబ్ కా సాథ్ సబ్ కా వికాస్” మా మంత్రం. మీరు, నేను అనే వివక్ష ఉండదు. ఆశ్రిత పక్షపాతం అనేదే ఉండదు. అందుకే ఆ బాట లోనే పయనించడం మా లక్ష్యం. ఈ రోజున ఈ మువ్వన్నెల జెండా దగ్గర నేను నిలబడి మమ్మల్ని మేము త్యాగం చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము అంటూ పునరుద్ఘాటిస్తున్నాను.

ప్రతి ఒక్క భారతీయునికి సొంత ఇల్లు ఉండాలి- అందుకే అందరికీ గృహ‌ నిర్మాణ‌ కల్పన పథకం. ప్రతి ఒక్క ఇంటికీ విద్యుత్తు సదుపాయం ఉండాలి-అందుకోసమే అందరికీ విద్యుత్తు. ప్రతి ఒక్క భారతీయ కుటుంబం వంట గది పొగ నుండి విముక్తం కావాలి- అందుకే అందరికీ వంటగ్యాస్. ప్రతి ఒక్క భారతీయునికి అవసరానికి సరిపడా నీరుండాలి- అందుకే అందరికీ నీరు. ప్రతి ఒక్క భారతీయుడు తనకు ఆసక్తి ఉన్నటువంటి రంగం లో నిపుణుడుగా మారాలి- అందుకే అందరికీ నైపుణ్య కల్పన. ప్రతి ఒక్క భారతీయునికీ భరించగల ధరల్లో మంచి ఆరోగ్య సేవలు కనీస అవసరం- అందుకే అందరికీ ఆరోగ్యం. ప్రతి భారతీయుడు తనకు సంపూర్ణ భద్రత ఉన్నదని భావించాలి, చక్కని బీమా రక్షణ అందాలి- అందుకే అందరికీ బీమా. ప్రతి ఒక్క భారతీయునికి ఇంటర్ నెట్ అనుసంధానం కావాలి- అందుకే కనెక్టివిటీ. ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాం. ఈ మంత్రాన్ని తు.చ. తప్పక పాటిస్తూ దేశాన్ని పురోగమన పథంలో మేం పయనింపచేస్తాం.

ప్రియమైన నా సోదరీ సోదరులారా, నా గురించి కూడా చాలా మంది చాలా చెబుతున్నారు. అవును, నిజమే. కొన్ని విషయాలు బహిరంగంగానే ఒప్పుకోదలచాను. మన కన్నా చాలా దేశాలు ముందుకు కదులుతున్నప్పడు, నేను అసహనంతో వుంటాను. నేను నా దేశాన్ని ఈ దేశాలన్నింటి కన్నా అగ్రభాగాన నిలపడం కోసం విశ్రాంతి అనేది ఎరుగకుండాను, అసహనంతోను ఉంటున్నాను.

ప్రియమైన నా దేశ వాసులారా, నేను అసహనంగానే ఉన్నాను. ఎందుకంటే పౌష్టికాహార లోపం పిల్లల ఎదుగుదలను దెబ్బ తీస్తున్న కారణంగా. అదే పెద్ద అవరోధంగా మారింది. దేశం నుండి పౌష్టికాహార లోపాన్ని తరిమికొట్టడం కోసం నేను విరామం లేకుండా ఉంటున్నాను.

నా దేశ వాసులారా, పేద వానికి సరైన ఆరోగ్యం సంరక్షణ వసతి అందుబాటులో లేకపోతే నేను ఆందోళనగానే ఉంటాను. సగటు జీవి వ్యాధుల నుండి దూరమై ఆరోగ్యంగా తయారయ్యే వరకు ఈ అసహనం తొలగదు.

సోదరీ సోదరులారా, దేశ పౌరులందరికీ నాణ్యమైన జీవితం అందించాలనే లక్ష్యసాధన లో నేను అసహనంగానే ఉంటాను. వారు చక్కని అవకాశాలతో జీవించగలిగే పరిస్థితి ఉండాలి, అప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది.

ప్రియమైన నా దేశవాసులారా, నా దేశాన్ని జ్ఞాన సంపద ఆధారితమైన, ఐటి నైపుణ్యాలే కీలకంగా నిలిచే నాలుగో పారిశ్రామిక విప్లవంలో ముందుకు నడిపించాలనే విషయంలో నేను అసహనంగానే ఉంటాను. నాకు కోపం కూడా వస్తుంది. ఆ దిశగా దేశాన్ని ముందుకు నడిపించడం కోసం నేను అసహనంగానే ఉంటాను.

ప్రియమైన నా దేశ వాసులారా, తనకు గల సామర్థ్యాలు, వనరులు నా దేశం పరిపూర్ణంగా వినియోగంలోకి తెచ్చుకోవాలి అనే కోణంలో నేను అసహనంగానే ఉంటాను. అప్పుడే ప్రపంచంలో మన దేశం గర్వంగా పురోగమించగలుగుతుంది.

ప్రియమైన నా దేశ వాసులారా, మేం పురోగమించాలనే కోరుతున్నాం. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా నిలిచిపోవడం లేదా ప్రతిష్టంభనను మే అనుమతించం. ఎవరి ముందూ తల వంచడం మన స్వభావం కాదు. దేశంలో ప్రతిష్టంభన ఏర్పడే పరిస్థితీ రాదు, తల వంచే అవసరమూ రాదు. మనం ముందుకు సాగుతూనే ఉండాలి. ఉన్నత శిఖరాలకు చేరుతూనే ఉండాలి.

సోదరీ సోదరులారా, మనం ఎంతో మహోన్నతమైన వారసత్వ సంపదకు వారసులం. వేదాలే మూలం అయిన ప్రాచీన వైభవం మన సొంతం. ఆత్మవిశ్వసం నుంచే ఆ వైభవం లభించింది. దానిని ముందుకు నడిపించాలన్నదే మా లక్ష్యం.

ప్రియమైన నా దేశ వాసులారా, భవిష్యత్తు ను గురించి కేవలం కలలే కంటూ కూర్చోవాలని మేం భావించడం లేదు. భవిష్యత్తు లో కొత్త శిఖరాలను అధిరోహించాలన్నదే మా ఆకాంక్ష. అగ్ర స్థానం లో నిలవాలన్న లక్ష్యం తోనే ముందుకు పోతాం. అందుకే ప్రియమైన నా దేశవాసులారా, దేశం తన కలలను పండించుకొనే విధంగా నేను ఒక కొత్త ఆశ ను, నవీనమైన ఆకాంక్ష ను, నూతనమైన ఒక నమ్మకాన్ని మీలో రగిలించాలనుకొంటున్నాను. అందుకే ప్రియమైన నా దేశవాసులారా..

‘అప్నే మన్ మే ఏక్ లక్ష్య్ లియే,

అప్నే మన్ మే ఏక్ లక్ష్య్ లియే,

మంజిల్ అప్ నీ ప్రత్యక్ష్ లియే,

అప్నే మన్ మే ఏక్ లక్ష్య్ లియే,

మంజిల్ అప్ నీ ప్రత్యక్ష్ లియే హమ్ తోడా రహే హై జంజీరే,

హమ్ తోడ్ రహే హై జంజీరే,

హమ్ బదల్ రహే హై తస్వీరే,

యే నవ్ యుగ్ హై, యే నవ్ యుగ్ హై,

యే నవ్ భారత్ హై, యే నవ్ యుగ్ హై.’

“ఖుద్ లిఖేంగే అప్ నీ తక్ దీర్, హమ్ బదల్ రహే హై తస్వీర్,

ఖుద్ లిఖేంగే అప్ నీ తక్ దీర్, యే నవ్ యుగ్ హై, నవ్ భారత్ హై,

హమ్ నికల్ పడే హై, హమ్ నికల్ పడే హై ప్రణ్ కర్ కే,

హమ్ నికల్ పడే హై ప్రణ్ కర్ కే, అప్ నా తన్ మన్ అర్పణ్ కర్ కే,

అప్ నా తన్ మన్ అర్పణ్ కర్ కే, జింద్ హై, జింద్ హై, జింద్ హై,

ఏక్ సూర్య్ ఉగానా హై, జింద్ హై ఏక్ సూర్య్ ఉగానా హై,

అంబర్ సే ఊంచా జానా హై, అంబర్ సే ఊంచా జానా హై,

ఏక్ భారత్ నయా బనానా హై, ఏక్ భారత్ నయా బనానా హై.”

ప్రియమైన నా సోదరీ సోదరులారా,

పవిత్రమైనటువంటి స్వాతంత్ర్య సందర్భం లో మరో సారి నేను నా శుభాభినందనలను తెలియజేస్తున్నాను. రండి, మనమంతా ‘జయ్ హింద్’ మంత్రాన్ని బిగ్గరగా పలుకుదాం.

జయ్ హింద్, జయ్ హింద్, జయ్ హింద్

భారత్ మాతాకీ జయ్

భారత్ మాతాకీ జయ్

భారత్ మాతాకీ జయ్

వందే మాతరమ్ వందే మాతరమ్ వందే మాతరమ్.