independenceday-2016

Press Information Bureau

Government of India

Prime Minister's Office

బొంబాయి ఐఐటి 56వ వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం

Posted On :11, August 2018 14:09 IST

ఈ రోజు ఆగష్టు 11వ తేదీ. నూట పది సంవత్సరాల క్రితం, ఇదే రోజున ఖుదీరాం బోస్ గారు మాతృభూమి కోసం గొప్ప త్యాగం చేశారు. ఆ శూరుడైనటువంటి విప్లవకారునికి నేను శిరస్సు ను వంచి ప్రణమిల్లుతాను; దేశం తరఫున ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటిస్తాను.

మిత్రులారా,

స్వాతంత్య్రం కోసం వారి జీవితాలను, వారి సర్వస్వాన్ని త్యాగం చేసిన వారు, వారంతా అమరులయ్యారు, మరి వారు స్ఫూర్తిప్రదాతలు కూడా అయ్యారు. అయితే, స్వాతంత్య్ర పోరాటం లో మన జీవితాలను త్యాగం చేసే సదవకాశం మనకు దక్కలేదు. మనం కూడా అదృష్టవంతులమే ఎందుకంటే, స్వతంత్ర భారతదేశం లో మనం ఎంతో ఆనందంగా జీవించగలుగుతున్నాము. స్వేచ్ఛాయుత భారత నిర్మాణం కోసం మన జీవితాలను త్యాగం చేయాలనే ఆనంద భరితమైన భావన తో మనం ఉన్నాము. మీలో విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని చూస్తుంటే మనం సరి అయిన మార్గం లోనే ముందంజ వేస్తున్నామనే భావన, ఈ రోజున నాకు కలుగుతోంది.

మిత్రులారా,

స్వతంత్ర భారతదేశం లో సాంకేతిక విజ్ఞానం ద్వారా జాతి నిర్మాణానికి ఒక నూతన మార్గాన్ని నిర్దేశించిన సంస్ధలలో ఐఐటి ముంబయి ఒకటి గా నిలచింది. గత 60 సంవత్సరాలు గా మీరు ఈ విధమైన ప్రగతి సాధన లో స్థిరమైన కృషి ని కొనసాగిస్తున్నారు. 100 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ సంస్థ ఈ రోజున 10,000 మంది విద్యార్థుల స్థాయి కి చేరింది. ఈ సమయంలో, మీరు ప్రపంచం లోని ఉత్తమమైన సంస్థలలో ఒకటి గా గుర్తింపు ను తెచ్చుకొన్నారు.

ఈ సంస్థ ఇప్పుడు వజ్రోత్సవాన్ని జరుపుకొంటోంది. నాముందు కూర్చుని ఉన్న వజ్రాలూ, ఈ రోజున డిగ్రీలు స్వీకరించిన వజ్రాలూ, ఇక్కడ నుండి పట్టా లు స్వీకరించి ప్రపంచ వ్యాప్తంగా దేశం గర్వపడేలా చేస్తున్న వజ్రాలూ.. అలా ఆ వజ్రాలన్నీ కూడాను ఇంకా చాలా ముఖ్యమైనవి.

ఈ సందర్భంగా దేశ విదేశాల నుండి ఈ రోజున ఇక్కడ పట్టా లు అందుకొంటున్న విద్యార్థులకు, వారి కుటుంబాలకు ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేయాలనుకొంటున్నాను.

ఈ సందర్భంగా డాక్టర్ రమేశ్ వాధ్వానీ గారికి ‘‘డాక్టర్ ఆఫ్ సైన్స్’’ పట్టా ను ప్రదానం చేయడమైంది. డాక్టర్ వాధ్వానీ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్య ప్రజల అవసరాలకు అనుసంధానం చేయడానికే రమేశ్ గారు వారి జీవిత పర్యంతం కృషి సలిపారు. ఉపాధి, నైపుణ్యం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత ల కల్పనకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించడం వంటి గొప్ప పనులను ఆయన వాధ్వానీ ఫౌండేశన్ ద్వారా స్వయంగా చేపట్టారు.

వాధ్వానీ గారి వంటి అనేక మంది విద్యార్థులు ఈ సంస్థ నుండి బయటకు వచ్చి ఈ రోజున దేశాభివృద్ధి లో చురుకుగా పాల్గొనడం నిజంగా మీ అందరికీ గర్వ కారణం.

గత ఆరు దశాబ్దాలుగా ఐఐటి ముంబయి చేసిన కృషి ఫలితమిది. తద్వారా దేశ ప్రాముఖ్యాన్ని ఇనుమడింపజేసిన కొన్ని ఎంపిక చేసిన సంస్థ లలో స్థానాన్ని సంపాదించుకుంది. త్వరలో మీకు 1,000 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం లభించనున్నట్లు ఇప్పుడే నాకు తెలిసింది. ఈ సంస్థలో మౌలిక సదుపాయాల అభివుద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని, ఈ సంస్థ కు చెందిన యావత్తు బృందాన్ని నేను అభినందిస్తున్నాను.

ఐఐటి పట్టభద్రులు సాధించిన విజయాలను, ఐఐటి ల కృషి ని చూసుకని దేశం గర్విస్తోంది. ఐఐటి. ల విజయం దేశ వ్యాప్తంగా అనేక ఇంజినీరింగ్ కళాశాలల స్థాపన కు దారి తీసింది. అవి ఐఐటి ల వల్ల స్ఫూర్తి ని పొందుతున్నాయి. తద్వారా భారతదేశం సాంకేతిక మానవ వనరుల శక్తి లో ప్రపంచం లోనే అత్యంత పెద్ద సమూహంగా అవతరించింది. ఐఐటి లు భారతదేశానికి అంతర్జాతీయంగా ఒక గుర్తింపు ను తీసుకువచ్చాయి. అనేక సంవత్సరాలుగా ఈ కృషి కొనసాగుతోంది. ఐఐటి పట్టభద్రులు అమెరికా కు వెళ్లి అక్కడ రాణించారు, ముందుగా విశ్వవిద్యాలయాలలో విద్యార్థులుగా వెళ్లి, అనంతరం వారు అక్కడ సాంకేతిక నిపుణులుగా, పారిశ్రామిక వేత్తలుగా, ఉన్నతాధికారులుగా, విద్యా వేత్తలుగా గుర్తింపు ను తెచ్చుకొన్నారు. పెద్ద సంఖ్యలో ఐఐటి విద్యార్థులు భారతదేశం లో ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ రంగాన్ని అంచలంచెలు గా అభివృద్ధి పరచారు. గతంలో భారతీయులు ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ రంగం లో కష్టపడి పనిచేసే వారుగా, ముఖ్యంగా ఇతర దేశాలలో, ప్రధానంగా అమెరికా లో తెలివైన వారుగా పరిగణింపబడే వారు. ప్రస్తుతం ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ పురోగతి కి భారతదేశం గమ్యం గా మారింది.

ఈ రోజు, భారతదేశం లోని అత్యుత్తమ స్టార్ట్- అప్ సంస్థలలో ఐఐటి పట్టభద్రులు ముందు వరుస లో ఉన్నారు. అనేక జాతీయ సమస్యల పరిష్కారం లో కూడా - ఈ స్టార్ట్- అప్ సంస్థ లు ముందు వరుస లో ఉన్నాయి. ఈ రోజున అత్యంత పెద్ద కార్పొరేశన్ లుగా గుర్తింపు పొందుతున్న సంస్థ లు నిన్నటి రోజున స్టార్ట్- అప్ సంస్థలు గా ప్రారంభమైనవే అన్న విషయాన్ని ఈ స్టార్ట్- అప్ సంస్థ ల ఉద్యమం లో పనిచేస్తున్న వారు లేదా స్టార్ట్- అప్ సంస్థ లను ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అవి వారి నిరంతర కృషి తో, ప్రత్యేక శ్రద్ధ తో కూడిన ఆలోచన సరళి కి ఫలాలని మనం గుర్తించాలి. ఈ ఆలోచన తోనే ఉండండి, పట్టు విడవ వద్దు; అప్పుడే మీరు విజయాన్ని సాధించగలుగుతారు.

ఇటువంటి ప్రాంగణంలో, ముఖ్యంగా ముంబాయి వంటి నగరం లో నివసించడం మీ అదృష్టం. ఇక్కడ ఒక వైపు సరస్సు, కొండలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు, మొసళ్ళు, చిరుత లు కూడా మీ ప్రాంగణం లో మీతో పాటు సంచరిస్తూ ఉంటాయి. ఇది ఇంకా ఆగస్టు మాసమే అయినప్పటికీ ఇక్కడి వాతావరణం ఈ రోజు చల్ల గా వుంది. మీరు గత నాలుగు సంవత్సరాలలో ఒక అద్భుతమైన అభ్యాస అనుభవాన్ని పొందివుంటారని నేను భావిస్తున్నాను.

మనం గత స్మృతులను ఒకసారి నెమరువేసుకుంటే కళాశాల ఉత్సవాలు, అంతర్ వసతి గృహ క్రీడలు, విద్యార్థులు- ఉపాధ్యాయుల సంఘాలు వంటి అనేక విషయాలు మనకు గుర్తుకు వస్తాయి. ఈ సందర్భంగా నేను మీ చదువులను గురించి కూడా ఒక సారి ప్రస్తావిస్తాను. మన విద్య వ్యవస్థ లో అందుబాటు లో ఉన్న విద్య లలో అత్యుత్తమమైంది మీకు లభించింది. భారతదేశపు భిన్నత్వం లో ఏకత్వాన్ని ఇక్కడ విద్యార్థుల్లో మనం గమనించవచ్చును. వివిధ రాష్ట్రాలు, వివిధ భాషలు, భిన్న నేపధ్యాల నుండి వచ్చిన మీరు ఇక్కడ విజ్ఞాన సముపార్జన లో ఒక్కటవుతున్నారు.

మిత్రులారా,

ఒక న్యూ ఇండియా నిర్మాణానికి కొత్త సాంకేతికత లపై కృషి చేస్తున్న దేశం లోని వివిధ సంస్థలలో ఐఐటి ముంబయి ఒకటిగా పేరుగాంచింది.

వచ్చే రెండు దశాబ్దాలలో ప్రపంచం ఏ మేరకు అభివృద్ధి చెందనుందో నూతన ఆవిష్కరణలు, కొత్త సాంకేతికత ల ద్వారా నిర్ణయమౌతుంది. ఈ నేపథ్యం లో మీ సంస్థ పాత్ర, ఐఐటి ల పాత్ర అత్యంత కీలకమైంది. 5జి టెక్నాలజీ లేదా కృత్రిమ మేధస్సు (AI) లేదా బ్లాక్ చైన్ టెక్నాలజీ లేదా బిగ్ డాటా విశ్లేషణ లేదా మశీన్ లర్నింగ్ లేదా ఈ టెక్నాలజీలన్నీ స్మార్ట్ మేన్యుఫాక్చరింగ్ కు, స్మార్ట్ సిటీస్ దార్శనికత కు చాలా ముఖ్యమైనవి.

మరి కాసేపట్లో ప్రారంభించబోతున్న కొత్త భవనం ఈ దిశగా చాలా ముఖ్యమైనది. ఈ భవనంలో ఎనర్జీ సైన్స్ & ఇంజినీరింగ్ శాఖ, పర్యావరణ శాస్త్రం & ఇంజినీరింగ్ కేంద్రం పనిచేస్తాయి. దేశానికీ, ప్రపంచానికీ ఇప్పుడు శక్తి మరియు పర్యావరణం అనేవి రెండు పెద్ద సవాళ్లుగా పరిణమించాయి. సమీప భవిష్యత్తు లో ఈ రంగం లో పరిశోధన కు ఈ ప్రదేశం ఒక అద్భుతమైన వాతావరణాన్ని కల్పిస్తుందన్నది యథార్థం.

ఈ భవనం లో ఒక సౌర ప్రయోగశాల ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు నాకు చెప్పారు. ఇది సౌర శక్తి సంబంధమైన పరిశోధనలు చేసే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. రానున్న రోజుల్లో స్వచ్ఛమైన ఇంధనానికీ, సౌర శక్తి కీ అదనంగా జీవ ఇంధనం కూడా ఒక పెద్ద వనరుగా ఉంటుంది. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా ఢిల్లీ లో నేను ఇదే విషయాన్ని చెప్తూ ఈ రంగానికి చెందిన సాంకేతిక విజ్ఞానాన్ని ప్రతి చిన్న, పెద్ద ఇంజినీరింగ్ సంస్థల లోనూ బోధించాలని, పరిశోధనలను నిర్వహించాలని నేను ఇప్పటికే సూచించాను.

మిత్రులారా,

ఐఐటి లు అంటే ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ అని దేశానికి మరియు ప్రపంచానికి ఎరుకే. అయితే, ఈరోజున ఐఐటి ల నిర్వచనం కొంత మారింది. ఇప్పుడు ఈ సంస్థలు ఒక్క సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన విషయాల అధ్యయనానికే పరిమితం కాలేదు. ఈ రోజున ఐఐటి లు భారతదేశ పరివర్తన కు సాధనాలు గా మారాయి.

మనం పరివర్తన ను గురించి మాట్లాడితే అప్పుడు దేశం స్టార్ట్- అప్ సంస్థ ల విప్లవం వైపు పయనిస్తోంది. ఆ విప్లవానికి మార్గదర్శనం చేసింది ఐఐటి లే. ఈ రోజున ప్రపంచం ఐఐటి లను స్టార్ట్- అప్ సంస్థల సంవర్ధనులు గా గుర్తించింది. ఈ రోజున భారతదేశం నుండి ఆవిర్భవిస్తున్న స్టార్ట్- అప్ సంస్థ ల విలువ భవిష్యత్తు లో ఒక బిలియన్ డాలర్ల కు మించే అవకాశం ఉంది. అదే విధంగా ఆ స్టార్ట్- అప్ సంస్థ ల సాంకేతికతలలో ప్రపంచం భవిష్యద్దర్శనం చేసింది.

మిత్రులారా,

ఈ రోజున, ప్రపంచం లోని బిలియన్ డాలర్ స్టార్ట్- అప్ సంస్థలలో డజన్ ల కొద్దీ సంస్థలు ఐఐటి ల నుండి ఉత్తీర్ణులైన వారు స్థాపించినవే. భవిష్యత్తు లో ఆ విధంగా స్థాపించే కొంతమంది ని నేను ఇప్పుడు నా ఎదుట చూస్తున్నాను.

మిత్రులారా,

నూతన ఆవిష్కరణలు, వ్యాపార సంస్థలు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థ గా తయారుచేయడానికి పునాదిగా పనిచేస్తాయి. ఈ పునాది పై ఒక దీర్ఘకాలిక సుస్థిర సాంకేతికత తో కూడిన ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది.

కచ్చితంగా చెప్పాలంటే ఈ కారణం వల్లనే స్టార్ట్ అప్ ఇండియా, అటల్ ఇనవేశన్ మిశన్ ల వంటి అనేక కార్యక్రమాలను మనం ప్రారంభించాము. ఈ పథకాల ఫలితాలను ఇప్పుడు మనం చూస్తున్నాము. స్టార్ట్- అప్ సంస్థ ల రంగం లో ఇప్పుడు భారతదేశం ప్రపంచం లో రెండో అతి పెద్ద పర్యావరణ వ్యవస్థ గా ఉంది. 10,000కు పైగా ఉన్న స్టార్ట్- అప్ సంస్థ లు ఇప్పుడు దేశంలో ఒక భాగం అయ్యాయి. వాటికి నిధులను సమకూర్చడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయడమైంది.

మిత్రులారా,

ఈ రోజున, ఆవిష్కరణల సూచీ స్థానాలలో మనం నిరంతరం ముందుకు దూసుకుపోతున్నాము. అంటే, దాని అర్ధం- విద్య నుండి పర్యావరణం వరకు మనం అనుసరిస్తున్న సంపూర్ణ విధానాన్ని ప్రపంచం గమనిస్తోంది. దేశం లో పరిశోధనలకు అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి, శాస్త్రీయ విధానాన్ని అభివృద్ధి చేయడానికి వీలుగా ఉన్నత విద్య రంగం లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది.

నూతన ఆవిష్కరణ అనేది 21వ శతాబ్దపు పర్యాయ పదం అయ్యింది. ఆవిష్కరణ లేని ఏ సమాజం అయినా స్తంభించి పోతుంది. స్టార్ట్- అప్ సంస్థ ల కేంద్రం గా రూపొందిన భారతదేశం నూతన ఆవిష్కరణ ల పట్ల తనకు గల ఆసక్తి ని తెలియజేస్తోంది. ఇదే ఆశయం తో మనం ముందుకు పోయి భారతదేశాన్ని మరిన్ని నూతన ఆవిష్కరణ ల గమ్యంగా రూపొందించాలి. ఇది ఒక్క ప్రభుత్వం కృషి వల్లనే చోటు చేసుకోదు. ఇది మీ వంటి యువజనుల వల్లే జరుగుతుంది. ఉత్తమమైన ఆలోచనలనేవి ప్రభుత్వ భవనాల నుండో ఆకర్షణీయమైన కార్యాలయాల నుండో రావు. అవి మీరు చదువుకున్నటువంటి ప్రాంగణాలలో నుండి, మీ వంటి యువజనుల మేధస్సులలో నుండి పుడతాయి.

మీకూ , ఇతర అనేక మంది యువజనులకూ నా విజ్ఞప్తి ఏమిటంటే భారతదేశం లోపల కొత్త ఆవిష్కరణలు చేయండి, మానవ జాతి కోసం నూతన ఆవిష్కరణలను తీసుకు రండి అనేదే.

జల వాయు పరివర్తన ను తగ్గించడం నుండి ఉత్తమ వ్యవసాయ ఉత్పాదకత సాధించడం వరకు, స్వచ్ఛమైన ఇంధనం నుండి జల సంరక్షణ వరకు, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడం దగ్గర నుండి సమర్ధవంతమైన వ్యర్ధ పదార్ధాల నిర్వహణ వరకు అత్యుత్తమ ఆలోచనలు భారతీయ ప్రయోగశాలల నుండి, ముఖ్యంగా భారతీయ విద్యార్థుల నుండి వస్తాయన్న విషయాన్ని మనం ధ్రువీకరించుకుందాం. భారతదేశం లో పరిశోధన మరియు నూతన ఆవిష్కరణల ప్రోత్సాహానికి మన వంతు కృషి మనం చేద్దాం.

గత నాలుగు సంవత్సరాలలో 7 కొత్త ఐఐటి లు, 7 కొత్త ఐఐఎమ్ లు, 2 ఐఐఎస్ఇఆర్ లు, 11 కొత్త ఐఐఐటి లు ఆమోదం పొందాయి. విద్య లో మౌలిక సదుపాయాలు, విధానాల పునరుజ్జీవనం (Revitalization of Infrastructure and Systems in Education - RISE) అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రానున్న నాలుగు సంవత్సరాలలో ఈ పథకంలో భాగంగా ఒక లక్ష కోట్ల కు పైగా రూపాయల నిధిని సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకోవడమైంది. కొత్త సంస్థలు, కొత్త మౌలిక సదుపాయాలూ అత్యవసరం. అయితే, అక్కడ రూపుదిద్దుకొనే నిపుణుల అవసరం ఇంకా చాలా ముఖ్యం. ఈ దిశగా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిని సారిస్తోంది.

మిత్రులారా,

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంగణాల్లో సుమారు 7 లక్షల మంది ఇంజినీర్ లకు శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. అయితే, ఇందులో కొంతమంది కేవలం పట్టాల కోసం ఉత్తీర్ణులు అవుతున్నారు. వారి నైపుణ్యాలు మన అంచనాలకు తగ్గట్టుగా అభివృద్ధి చెందలేవు. ఈ విద్యార్థుల నాణ్యత ను ఏ విధంగా మెరుగుపరచగలమో ఇక్కడ హాజరైన ఆచార్యులు, నిపుణులు ఆలోచించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారు తగిన సిఫారసు లతో ముందుకు రావాలని కోరుతున్నాను. పరిమాణంతో పాటు, నాణ్యతను కూడా నిర్ధారించుకోవడం మన సమష్టి బాధ్యత. ఇందుకోసం ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది.

ప్రధాన మంత్రి రిసర్చ్ ఫెలోస్ పథకాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి మీ అందిరికీ తెలిసిందే. ఈ పథకం లో భాగంగా దేశం లోని వేయి మంది ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ విద్యార్థులకు పరిశోధన కు అవసరమైన వనరులు అందుబాటులో ఉంటాయి. దీనితో పాటు, ఈ పథకంలో భాగంగా ఎంపిక అయిన ఐఐటి లు, ఐఐఎస్ సి ల వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో పిహెచ్.డి. చేయడానికి వీలుగా ప్రవేశానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దేశం లో చదువుకొంటున్న సమయం లోనే పరిశోధన చేయడానికి మీకు ఈ ఫెలోశిప్ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. ఐఐటి ముంబయి విద్యార్థులు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.

మిత్రులారా,

ఈ రోజున ఇక్కడ హాజరైన మీరంతా ఉపాధ్యాయులో, భావి నాయకులో అవుతారు. దేశానికి లేదా ఏదైనా సంస్థ కు విధాన నిర్ణయ రంగం లో మీరు పనిచేసే అవకాశం ఉంది. సాంకేతిక విజ్ఞానం, నూతన ఆవిష్కరణ ల ద్వారా మీరు స్వంతం గా కొత్త స్టార్ట్- అప్ సంస్థ లను ఏర్పాట్లు చేసుకొంటున్నందువల్ల ఈ విషయమై ఏ విధంగా ముందుకు పోవాలి అనే దానిపై మీకు స్పష్టమైన దృష్టి ఉండాలి.

మిత్రులారా,

కొన్ని పనులు చేసేటప్పుడు మనం పాత విధానాలను అంత సులువుగా వదిలిపెట్టలేము. ఇది సమాజం తో ముఖ్యంగా ప్రభుత్వ విధానాలతో ఉన్న సమస్యగా మనం పరిగణించవచ్చు. వేలాది సంవత్సరాలుగా మనలో వృద్ధి చెందిన అలవాట్లను, వందలాది సంవత్సరాలుగా అమలులో ఉన్న విధానాలను మార్చడానికి ఒప్పించడం ఎంత కష్టమో ఒకసారి ఊహించండి. అయినప్పటికీ, మీ ఆలోచనలలో, ఆచరణలో అంకిత భావం, ప్రేరణ, ఆకాంక్ష కేంద్రీకృతమై వుంటే మీరు ఈ అవాంతరాలన్నింటినీ అధిగమించి విజయాన్ని సాధిస్తారు.

మీ అందరి ఆకాంక్షలు, దేశం లోని మిలియన్ ల కొద్దీ ఉన్న యువజనుల ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ రోజున పనిచేస్తోంది. మీరు విజయం సాధిస్తారా లేదా, మీరు ఈ పని చేయగలరా లేదా అనే సంశయాన్ని మీ మనస్సు లో నుండి విడనాడాలి. అదే నేను మీకు చేసే విన్నపం. మీ లక్ష్యాలు, మీ ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటే అంత ఉన్నతంగా మీరు ప్రేరణను పొందుతారు; గందరగోళం మీ ప్రతిభ ను పరిమితం చేసివేస్తుంది.

మిత్రులారా,

కేవలం ఆకాంక్షలు ఉంటే సరిపోదు, దానికి అనుగుణంగా లక్ష్యాలను నిర్దారించుకోవడం కూడా ముఖ్యం. మీలో ఈ రోజు సంస్థ నుండి ఉత్తీర్ణులై బయటకు వస్తున్న వారు, భవిష్యత్తులో ఉత్తీర్ణులై బయటకు వచ్చే వారు, మీరందరూ ఏదో ఒక సంస్థ లో చేరతారు లేదా ఒక కొత్త సంస్థ కు అంకురార్పణ చేస్తారు. అటువంటి పరిస్థితులలో దేశ అవసరాలను, దేశ ప్రజల అవసరాలను మీరు పరిగణన లోకి తీసుకొంటారని నేను భావిస్తున్నాను. అనేక సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కారాలు కనుగొనే అవకాశం మీకు ఉంది.

మిత్రులారా,

దేశం లోని 1.25 బిలియన్ మంది ప్రజల జీవన సౌలభ్యాన్ని లక్ష్యంగా చేసుకొని మీరు చేపట్టే అటువంటి ప్రతి పనికీ ఈ ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది. అప్పుడు అవి దేశ ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయి. అందువల్లనే విద్యార్థులు, శాస్త్రవేత్తలు, మీ వంటి పారిశ్రామికవేత్తలతో నేను ఎప్పుడు మాట్లాడినా ఐఐటి ల వంటి అన్ని సంస్థల చుట్టుపక్కల ఉన్న సైన్స్ క్లస్టర్ ల గురించి తప్పకుండా చర్చిస్తాను.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశ్రమలకు, స్టార్ట్- అప్ సంస్థలకు సంబంధించిన వ్యక్తులు - ఒకరి అవసరాలకి అనుగుణంగా ఒకరు ఒకే ప్రదేశంలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా స్టార్ట్- అప్ సంస్థలు అవకాశాలు కల్పించాలనేదే ఈ ఆలోచన లోని ప్రధానోద్దేశ్యం.

మీ సంస్థ ఉన్న ముంబయి ప్రాంతాన్ని ఉదాహరణగా తీసుకుంటే గ్రేటర్ ముంబయి లో సుమారు 800 కళాశాలలు, సంస్థలు ఉన్నాయి. సుమారు 9 లక్షల మంది యువజనులు ఈ ప్రాంతంలో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ రోజున మనం స్నాతకోత్సవం కోసం ఇక్కడ హాజరయ్యాం. ఇది ఈ సంస్థ వజ్రోత్సవ సంవత్సరం కూడా. ఈ సందర్భంగా మీతో ఒక ప్రతిజ్ఞ ను చేయించాలని నేను అనుకుంటున్నాను. ఐఐటి ముంబయి ఈ నగరానికి చెందిన ఒక ప్రావీణ్య కేంద్రం గా రూపొందగలదా ?

మిత్రులారా,

ఒక చట్టాన్ని అమలుచేయడం ద్వారా ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎమ్ ల) కు ప్రభుత్వం స్వతంత్ర ప్రతిపత్తి ని మంజూరు చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఐఐఎమ్ లలో విద్యాభ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఈ సంస్థలలో మరింత క్రియాశీల భూమిక ను పోషించాలనే విషయంపై కూడా ప్రభుత్వం దృష్టి ని కేంద్రీకరించింది.

ఐఐఎమ్ ల పాలక మండలి కి వారు ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. తమ పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోడానికి వీలుగా ఐఐటి ల వంటి సంస్థలు తగిన చర్యలను తీసుకొనే అవకాశాన్ని కూడా పరిశీలించాలి.

ఇది జరిగినట్లయితే వారి పూర్వ సంస్థ అభివృద్ధి కోసం ఏదైనా ఒక మంచి పని చేసే అవకాశం పూర్వ విద్యార్థులకు కూడా కలుగుతుంది. ఈ రోజున నా ముందు కూర్చొనివున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తు లో ఒక పూర్వ విద్యార్థి అవుతారు. ఈ సంస్థ ను ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడం లో పూర్వ విద్యార్థులకు ఒక ముఖ్య పాత్ర పోషించే శక్తి ఉందన్న నా ఆలోచన తో మీరందరూ ఏకీభవిస్తారని భావిస్తున్నాను. ఒక్క ఐఐటి ముంబయి లోనే 50,000 మంది కన్నా ఎక్కువగా పూర్వ విద్యార్థులు ఉన్నట్లు నాకు చెప్పారు. వారి పరిజ్ఞానం నుండి, అనుభవం నుండి మీరు ఎంతో ప్రయోజనాన్ని పొందవచ్చు.

మిత్రులారా,

మీరు ఎంతో కష్టపడి ఇంతవరకు వచ్చారు. ఎంతో కష్టపడినప్పటికీ, మీతో పాటు చదువుకున్న అనేక మంది ఇక్కడికి చేరుకోలేకపోయి ఉండవచ్చు. మీకు అమోఘ శక్తి సామర్ధ్యాలు ఉండడం వల్ల మీరు ఈ రోజు అద్భుత ఫలితాలను సాధించారు. అయితే, మీలాంటి మిలియన్ కొద్దీ యువజనులు కష్టపడి పనిచేసినప్పటికీ వారు సాఫల్యాన్ని సాధించలేకపోయారు. అంటే, దాని అర్ధం వారికి ప్రతిభ లేదని కాదు. సరైన అవకాశాలు లేకపోవడం, మార్గదర్శకత్వం లోపించడం వల్ల వారు ఈ అవకాశాన్ని పొందలేకపోయారు. అటువంటి విద్యార్థులకు మార్గదర్శనం నెరిపి వారి జీవితాలలో ఒక కొత్త వెలుగు ను, ఒక నవీనమైన శక్తి ని, ఒక నూతన ఉత్సాహాన్ని మీరు తీసుకురావాలి.

ఐఐటి ముంబయి పరిసరాలలోని పాఠశాలలను సమీపించేందుకు ఒక కార్యక్రమాన్ని రూపొందించినా సరే ఎంతో బాగుంటుంది. చిన్నారులను ఈ ప్రాంగణం లోకి తీసుకు వచ్చే ఏర్పాట్లను చేస్తే వారికి విజ్ఞాన శాస్త్రం లో పరిశోధన చేయాలనే ప్రేరణ కలుగుతుంది. దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో అటల్ టింకరింగ్ లాబ్స్ అనే భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా బాలలకు కృత్రిమ మేధస్సు, 3డి ప్రింటింగ్ వంటి కొత్త టెక్నాలజీ లను గురించి తెలియజేస్తున్నారు.

ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రామానికి పాఠశాలల్లో మీరు రూపొందించే కార్యక్రమం ఎంతగానో సహాయపడుతుంది. ఆ యువ మేధస్సు నుండి వెలువడే కొత్త ఆలోచనలు ఒక్కోసారి మీకు, మావంటి పెద్దవారి కి కూడాను కొంత ప్రేరణను కలిగించే అవకాశం తప్పకుండా ఉంది.

మిత్రులారా,

ఈ రోజు మీరు అందుకున్న పట్టా, మీ లక్ష్య సాధనలో మీరు చూపిన అంకితభావానికి ప్రతీక. ఇది మీ జీవితం లో కేవలం ఒక మైలురాయి. ఈ ప్రపంచంలో మీరు ఎదుర్కోవలసిన అసలైన సవాళ్లు మీకోసం ఎదురుచూస్తున్నాయన్న సంగతిని మీరు దృష్టి లో పెట్టుకోండి.

ఇంతవరకు మీరు సాధించిందల్లా, ఇకపైన మీరు సాధించబోయేదల్లా.. వీటితో.. మీ కుటుంబ సభ్యుల ఆశలు, ఇంకా 1.25 బిలియన్ దేశ వాసుల ఆశలు, అదే విధంగా మీ యొక్క స్వీయ ఆకాంక్షలు సైతం ముడివడివున్నాయి. ఇక పై మీరు చేసే పనులు కొత్త తరాల భవిష్యత్తు ను నిర్మించగలవు. తద్వారా న్యూ ఇండియా కూడా పటిష్టతరం కాగలదు.

మిలియన్ ల కొద్దీ అంచనాలను నెరవేర్చడంలో మీకు విజయం చేకూరుగాక. ఇందుకోసం మరొక్క మారు మీ అందరికీ నేను నా యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. మీ మధ్య కొంత సమయం గడిపే అవకాశం నాకు చిక్కింది. ఈ అవకాశానికి నన్ను నేను కృత‌జ్ఞ‌తాబద్ధుడిగా భావించుకొంటున్నాను.

మీకు అనేక ధన్యవాదాలు.


*****