Prime Minister's Office
71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్ర కోట బురుజుల మీద నుండి ప్రసంగించిన ప్రధాన మంత్రి
Posted On :15, August 2017 10:37 IST
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్ర కోట బురుజుల మీద నుండి ప్రసంగించారు.
భారత స్వాతంత్ర్య సాధనకు మహిళామణులు, పురుషులు అహర్నిశలు పడిన శ్రమను ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే మనం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాలు, గోరఖ్ పుర్ విషాదం వంటి సంఘటనల్లో బాధితులను ఆదుకునేందుకు భుజం భుజం కలిపి నడవాలని ఆయన పిలుపు ఇచ్చారు.
ఇది భారతదేశ చరిత్రలో కలకాలం గుర్తుండిపోయే ప్రత్యేకతలు సంతరించుకున్న సంవత్సరమని ప్రధాన మంత్రి అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికోత్సవం, చంపారణ్ సత్యాగ్రహం శత వర్షాలు పూర్తి చేసుకోవడం, బాల గంగాధర తిలక్ స్ఫూర్తితో ప్రారంభమైన ‘సార్వజనిక్ గణేశ్ ఉత్సవ్’ 125 వ వార్షికోత్సవం ఆ ప్రత్యేకతలు అని ఆయన అన్నారు.
1942 నుండి 1947 సంవత్సరాల మధ్య కాలంలో భారత జాతి సంఘటిత శక్తిని ప్రదర్శించిన ఫలితమే స్వాతంత్ర్య సాధన ఆని ప్రధాన మంత్రి అన్నారు. 2022 నాటికి సరికొత్త భారతావనిని ఆవిష్కరించేందుకు మనం అదే సుసంఘటిత నిర్ణయాత్మక వైఖరిని, కట్టుబాటును ప్రదర్శించాలని ఆయన పిలుపు ఇచ్చారు. మన దేశంలో ప్రతి ఒక్కరూ సమానులేనని చెబుతూ, మనందరం కలిసికట్టుగా గుణాత్మకమైన పరివర్తన తీసుకురాగలుగుతామని ప్రధాన మంత్రి అన్నారు.
మనందరం ‘‘చల్తా హై’’ (నడుస్తుందిలే) అనే ఉదాసీన వైఖరిని విడనాడి, దాని స్థానంలో "బదల్ సక్ తా హై’’ (మార్పు తీసుకురాగల శక్తి) అనే సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలని ప్రధాన మంత్రి పిలుపు ఇచ్చారు.
దేశ భద్రతే మన ప్రాథమ్యం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కి చెబుతూ, కొద్దికాలం క్రితం నిర్వహించిన సర్జికల్ దాడులే ఇందుకు ప్రబల నిదర్శనమన్నారు. ప్రపంచంలో భారతదేశం పలుకుబడి, హోదా పెరుగుతున్నాయని, ఉగ్రవాదంపై మనం చేస్తున్న పోరాటంలో ఎన్నో దేశాలు చేతులు కలిపి సహకరిస్తున్నాయని ఆయన తెలిపారు. నోట్ల చెలామణీ రద్దు ను గురించి ప్రస్తావిస్తూ దశాబ్దాలుగా జాతిని, నిరుపేదలను దోచుకున్న వారు ఇక ఏ మాత్రం హాయిగా నిద్రించలేని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. నిజాయతీకే ఇప్పుడు అగ్రతాంబూలమని తెలిపారు. నల్లధనంపై పోరాటం కొనసాగుతుందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. సాంకేతిక పరిజ్ఞానమే పారదర్శకతను తీసుకువస్తుందన్నారు. మరిన్ని డిజిటల్ లావాదేవీలు నిర్వహించండంటూ ప్రజలను ఆయన ప్రోత్సహించారు.
మన దేశంలో నెలకొన్న సహకారాత్మక సమాఖ్య తత్వానికి నిలువెత్తు నిదర్శనం జిఎస్‌టి అమలు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సమ్మిళిత ఆర్థిక కార్యకలాపాల ద్వారా పేద ప్రజలు కూడా ప్రధాన ఆర్థిక స్రవంతిలో భాగస్వాములవుతున్నారని చెప్పారు. సత్పరిపాలన అంటే విధానాల సరళీకరణ, వేగం అని ఆయన అన్నారు. జమ్ము & కశ్మీర్ విషయం ప్రస్తావిస్తూ దూషణలు గాని లేదా తుపాకిగుండ్లు గాని అక్కడ సమస్యలను పరిష్కరించజాలవని, హృదయానికి హత్తుకోవడం ద్వారానే అక్కడ సమస్యలను పరిష్కరించడం సాధ్యపడుతుందని (న గాలీ సే, న గోలీ సే, పరివర్తన్ హోగా గలే లగానే సే.. అని) ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.
వ్యవస్థకు ప్రజలే చోదక శక్తిగా ఉండాలని, వ్యవస్థ ప్రజలను నడిపేదిగా ఉండకూడదన్నదే (తంత్ర సే లోక్ నహీ, లోక్ సే తంత్ర చలేగా) తన ‘న్యూ ఇండియా’ దార్శనికతకు మూలమని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఆహారధాన్యాలు ఉత్పత్తి చేసిన వ్యవసాయదారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఈ ఏడాది ప్రభుత్వం 16 లక్షల టన్నుల పప్పుధాన్యాలు సేకరించిందంటూ, గత సంవత్సరాలతో పోల్చితే ఇది చాలా అధికమని ఆయన చెప్పారు.
సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు వస్తున్న కొద్దీ ఉపాధి రంగంలో భిన్న నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. దేశంలో యువత ఉపాధి కల్పన శక్తి కావాలి తప్ప ఉద్యోగాల కోసం దేహి అని యాచించే వారు కాకూడదని ఆయన ఉద్బోధించారు.
తలాక్ అంటూ మూడు సార్లు పలకడం వల్ల బాధితులవుతున్న మహిళలను గురించి ప్రస్తావిస్తూ, ఈ దురాచారానికి వ్యతిరేకంగా నిలబడే సాహసం చూపిన వారిని తాను అభినందిస్తున్నానని, వారి పోరాటానికి జాతి యావత్తు మద్దతు ఇస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు.
శాంతి, ఐక్యత, సామరస్యాలకే భారతదేశం అండగా నిలుస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు. మతవాదం, కులవాదం మనకు ఏ మాత్రం సహాయకారి కాబోవని ఆయన అన్నారు. విశ్వాసాల ముసుగులో దౌర్జన్యకాండను దృఢస్వరంతో ఖండిస్తూ ఇలాంటి చర్యలను భారతదేశం ఆమోదించబోదని శ్రీ మోదీ స్పష్టం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ నినాదం ‘‘భారత్ ఛోడో’’ (దేశం వదిలి పొండి) కాగా, ‘‘భారత్ జోడో’’ (భారత్ ను భాగస్వామిగా చేసుకోండి) అనేది ఇప్పటి నినాదం అని ప్రధాన మంత్రి అన్నారు.
తూర్పు, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధిపై అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి చెప్పారు. వేగం ఏ మాత్రం తగ్గకుండానే తమ ప్రభుత్వం భారతదేశాన్ని అభివృద్ధి పథంలో కొత్త పట్టాలపై నడుపుతున్నదని ఆయన అన్నారు.
ప్రాచీన గ్రంథాల్లోని కొన్ని అంశాలను ఉటంకిస్తూ మనం సరైన సమయంలో సరైన చర్య తీసుకోలేకపోతే ఆశించిన ఫలితాలు మనం సాధించలేమని ప్రధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు. ‘న్యూ ఇండియా’ ఆవిష్కారానికి ‘టీమ్ ఇండియా’కు ఇదే సరైన సమయమని ఆయన సూచించారు.
‘‘పేదలందరికీ తల దాచుకునేందుకు ఇళ్లుండాలి. అందరికీ విద్యుత్తు, నీటి సౌకర్యం అందుబాటులో ఉండాలి. రైతన్నలు ఎలాంటి బాధలకు తావు లేకుండా జీవనం సాగిస్తూ, సంపాదన రెట్టింపు చేసుకోగల పరిస్థితి ఏర్పడాలి. కలలు సాకారం చేసుకునేందుకు యువతీయువకులకు చక్కని అవకాశాలు అందుబాటులో ఉండాలి. దేశంలో ఉగ్రవాదం, మతవాదం, కులతత్వం, అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి తావు ఉండకూడదు. స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన దేశం ఆవిర్భవించాలి. అదే ‘నవ భారతం’, అలాంటి దేశాన్ని మనం ఆవిష్కరిద్దాం’’ అని ప్రధాన మంత్రి పిలుపు ఇచ్చారు.
శౌర్య పురస్కార విజేతల కోసం ఒక వెబ్ సైట్‌ను ప్రారంభిరిస్తున్నట్టు ప్రధాన మంత్రి ప్రకటించారు.
***