Prime Minister's Office
స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
Posted On :31, October 2018 18:52 IST
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచం లో అత్యంత ఎత్తైన విగ్రహం ‘‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’’ ని దేశ ప్రజల కు ఈ రోజు న అంకితం చేశారు.
182 మీటర్ల ఎత్తు కలిగిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి విగ్రహాన్ని ఆయన జయంతి నాడు గుజరాత్ లోని నర్మద జిల్లా కేవడియా లో దేశ ప్రజల కు అంకితం చేయడం జరిగింది.
ప్రారంభ కార్యక్రమం లో భాగం గా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని దేశ ప్రజల కు అంకితం చేస్తున్నందుకు సంకేతమా అన్నట్టుగా ప్రధాన మంత్రి మరియు ఇతర ప్రముఖులు ఒక కలశం లోకి మట్టిని, నర్మద జలాల ను ధార పోశారు. విగ్రహాభిషేకాన్ని మొదలు పెట్టడానికి ప్రధాన మంత్రి ఒక తులా దండాన్ని నొక్కారు.
వాల్ ఆఫ్ యూనిటీ ని ఆయన ప్రారంభించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పాదాల చెంత ప్రధాన మంత్రి ప్రత్యేక ప్రార్థన ను నిర్వహించారు. ఒక సంగ్రహాలయాన్ని, ప్రదర్శన ను మరియు ప్రేక్షకుల చిత్రశాల ను ఆయన సందర్శించారు. ఈ చిత్రశాల 153 మీటర్ల ఎత్తున ఉండి ఏక కాలం లో 200 మంది వరకు సందర్శకులు ఇందులో ప్రవేశించేందుకు అనువుగా ఉంది. ఇది సర్దార్ సరోవర్ ఆనకట్ట ను, దాని జలాశయాన్ని, సాత్పుర పర్వత పంక్తుల ను మరియు వింధ్య పర్వత పంక్తుల ను కన్నుల పండుగ గా దర్శింప చేస్తుంది.
విగ్రహాన్ని దేశ ప్రజల కు అంకితం చేస్తున్న కాలం లో ఐఎఎఫ్ యుద్ధ విమానాలు గౌరవాభివందనం చేస్తూ ఎగిరాయి; సాంస్కృతిక బృందాలు కళా రూపాల ను ప్రదర్శించాయి.
ఈ సందర్భంగా భారతదేశ ప్రజల కు ప్రధాన మంత్రి అభినందన లను తెలియ జేస్తూ యావత్తు దేశం ఈ రోజు న రాష్ట్రీయ ఏకతా దివస్ను ఉత్సవం వలె జరుపుకొంటోందన్నారు.
ఈ రోజు భారతదేశ చరిత్ర లో ఒక ప్రత్యేక ఘడియ గా నిలచిపోతుందని ఆయన అన్నారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీతో భారతదేశం ఈ రోజు న భవిష్యత్తు కై ఒక సమున్నత ప్రేరణ ను తనకు తాను ప్రసాదించుకొందని ఆయన చెప్పారు. ఈ విగ్రహం సర్దార్ పటేల్ గారి సాహసాన్ని, సామర్ధ్యాన్ని మరియు సంకల్పాన్ని భావి తరాల కు జ్ఞాపకం చేస్తూ ఉంటుందని ప్రధాన మంత్రి చెప్పారు. సర్దార్ పటేల్ గారు ఆవిష్కరించినటువంటి భారతదేశం ప్రస్తుతం ఒక పెద్ద ఆర్థిక శక్తి గాను, వ్యూహాత్మక శక్తి గాను రూపుదిద్దుకొనే దిశ గా పయనిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.
సర్దార్ పటేల్ గారి పరిపాలన సేవల తాలూకు దార్శనికత ను ఒక ఉక్కు చట్రం గా ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.
విగ్రహ నిర్మాణానికి గాను తమ పొలాల్లోని మట్టి ని మరియు తమ వ్యవసాయ ఉపకరణాల్లో నుండి తీసిన ఇనుము ను అందించిన రైతుల ఆత్మ గౌరవానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఒక ప్రతీక అని ఆయన అభివర్ణించారు. భారతదేశం లోని యువత ఆకాంక్షల ను ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ మంత్రం ద్వారా మాత్రమే సాధించవచ్చని ఆయన అన్నారు. ఈ విగ్రహ నిర్మాణం తో మమేకమైన ప్రతి ఒక్కరి ని ఆయన అభినందించారు. ఈ విగ్రహం ఈ ప్రాంతం లో గణనీయ పర్యటన అవకాశాల ను సృష్టించగలుగుతుందని ఆయన చెప్పారు.
స్వాతంత్య్ర సమర యోధులు మరియు మహా నాయకుల సేవ ను జ్ఞప్తి కి తెచ్చుకొనేందుకు ఇటీవల కొన్ని సంవత్సరాల్లో అనేక స్మారకాల ను తీర్చిదిద్దుకొన్న సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కి తోడు ఢిల్లీ లో సర్దార్ పటేల్ గారి కి అంకితం చేసిన ఒక వస్తు ప్రదర్శన శాల ను, గాంధీ నగర్ లోని మహాత్మ మందిరాన్ని మరియు దండి కుటీర్ ను, బాబా సాహెబ్ భీమ్ రావ్ ఆంబేడ్ కర్ కు అంకితం చేసిన పంచ్ తీర్థ్ ను, హరియాణా లో సర్ ఛోటూ రామ్ గారి విగ్రహాన్ని, ఇంకా కచ్ఛ్ లో శ్యాంజీ కృష్ణ వర్మ మరియు వీర్ నాయక్ గోవింద్ గురు ల యొక్క స్మారకాల ను ఆయన ప్రస్తావించారు. ఢిల్లీ లో సుభాష్ చంద్ర బోస్ కు అంకితం చేసే ఒక వస్తు ప్రదర్శన శాల, ముంబయి లో శివాజీ విగ్రహం లతో పాటు దేశ వ్యాప్తంగా ఆదివాసి సంగ్రహాలయాల పనులు పురోగమనం లో ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఒక బలమైన మరియు సమ్మిళితమైన భారతదేశాన్ని సర్దార్ పటేల్ గారు స్వప్నించారని ప్రధాన మంత్రి వెల్లడించారు. ఆ కల కు వాస్తవ రూపాన్ని ఇచ్చే దిశ గా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. అందరికీ గృహ వసతి కల్పన, అందరికీ విద్యుత్తు సదుపాయాన్ని కల్పించడం తో పాటు రహదారి సంధానం, ఇంకా డిజిటల్ కనెక్టెవిటీ ల దిశ గా జరుగుతున్న కృషి ని ఆయన ప్రస్తావించారు. అలాగే, ‘ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన’ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జిఎస్‌టి, ఇ-నామ్ (e-NAM), ఇంకా ‘‘వన్-నేశన్, వన్-గ్రిడ్’’ ల వంటి ప్రయత్నాలు కూడా వివిధ మార్గాల లో దేశాన్ని ఏకీకృతం చేసేందుకు తోడ్డడ్డాయని ఆయన అన్నారు.
దేశ ఐక్యత ను, సమగ్రత ను పరిరక్షించడం మరియు విచ్ఛిన్నకర శక్తులన్నింటి ప్రయత్నాల ను తిప్పికొట్టడం మన అందరి సమష్టి బాధ్యత అని ప్రధాన మంత్రి వివరించారు.
***