న్యూ ఢిల్లీ లోని పటేల్ చౌక్ లో ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వద్ద రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లు ఈ రోజు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని పుష్పాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఆ తరువాత మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియమ్ లో జెండాను ఊపడం ద్వారా ‘‘రన్ ఫర్ యూనిటీ’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అందించిన సేవలను, ప్రత్యేకించి దేశాన్ని ఏకం చేయడంలో ఆయన చేసిన కృషిని గుర్తుకు తెచ్చారు.
సర్దార్ పటేల్ ను, మరియు మన దేశాన్ని నిర్మించే దిశగా ఆయన అందించిన సహాయాన్ని భారతదేశ యువత గౌరవిస్తోందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
భారతదేశం తన భిన్నత్వం పట్ల గర్విస్తోందని, ఈ విధమైన అతిశయంతో పాటు ఏకతను పునః పటిష్టం చేసుకొనే అవకాశాన్ని ‘‘రన్ ఫర్ యూనిటీ’’ వంటి సందర్భాలు మనకు అందిస్తాయని ప్రధాన మంత్రి చెప్పారు.
అలాగే, ఈ రోజు పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతిని కూడా జరుపుకొంటున్న విషయాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ జ్ఞాపకం చేశారు.
కార్యక్రమంలో పాలుపంచుకొన్న వారందరి చేత ప్రధాన మంత్రి ఒక ప్రతిజ్ఞను చేయించారు.