independenceday-2016

Press Information Bureau

Government of India

Prime Minister's Office

భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్ర కోట బురుజుల మీది నుంచి ప్రసంగించిన ప్రధాన మంత్రి

Posted On :15, August 2018 10:51 IST

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట బురుజుల మీది నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

భార‌త‌దేశం లో ప్ర‌స్తుతం ఆత్మ‌ విశ్వాసం  తొణికిస‌లాడుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేస్తూ- నౌకాదళానికి చెందిన యువ మ‌హిళా అధికారులు ఆరుగురు చేపట్టిన నావికా సాగ‌ర్ ప‌రిక్ర‌మ  విజ‌య‌వంతం కావడం, అణ‌కువ గల నేప‌థ్యాలు కలిగిన భార‌తీయ యువ క్రీడాకారులు ఘ‌న‌కార్యాలను సాధించ‌డం వంటి సంగతులను ప్ర‌స్తావించారు.  ప్రతి 12 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి నీల‌గిరి ప‌ర్వ‌త ప్రాంతాల‌లో పూచే నీల‌కురింజి పుష్పాల ను గురించి  కూడా ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు.  ఇటీవ‌లే ముగిసిన పార్ల‌మెంటు స‌మావేశాలు సామాజిక న్యాయం వైపు నిలచాయని ఆయ‌న తెలిపారు.  భార‌త‌దేశం ప్ర‌స్తుతం ప్ర‌పంచం లో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ గా ఉన్నట్లు ఆయ‌న చెప్పారు.  

స్వాతంత్య్ర యోధుల‌కు, అమ‌ర‌వీరుల‌కు ప్ర‌ధాన మంత్రి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.  భ‌ద్ర‌త ద‌ళాల‌కు చెందిన జ‌వానుల‌కు, పోలీసు బ‌ల‌గాల‌కు ఆయ‌న న‌మ‌స్క‌రించారు.  మ‌రీ ముఖ్యంగా, 1919వ సంవ‌త్స‌రం బైశాఖీ నాటి జలియాన్ వాలా బాగ్ సామూహిక హత్య లో పలువురు ప్రాణాలను స‌మ‌ర్ప‌ించడాన్ని ఆయ‌న స్మరించారు.  దేశం లోని కొన్ని ప్రాంతాల‌లో వ‌ర‌ద‌ల బారినపడ్డ బాధితులకు ఆయ‌న సంతాపాన్ని వ్యక్తం చేశారు.  

అన్ని ర‌కాల బంధ‌నాల నుండి ప్ర‌పంచానికి భారతదేశం స్వేచ్ఛా మార్గాన్ని చూప‌గ‌లుగుతుందని క‌వి సుబ్ర‌హ్య‌ణ్యం భార‌తి చెప్పిన మాట‌ ల‌ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా ఉదాహరించారు.  అసంఖ్యాక స్వాతంత్య్ర యోధులు కన్న కలలు సైతం అటువంటి వే అని ఆయ‌న అన్నారు.  ఈ స్వప్నాన్ని సాకారం చేయడం కోసమే బాబా సాహెబ్ ఆంబేడ్ కర్ పేద‌ల‌కు న్యాయం తో పాటు అంద‌రికీ జీవితం లో ముందంజ వేసేందుకు స‌మాన అవ‌కాశాలు ల‌భించేట‌టువంటి ఒక దేశం ఏర్ప‌డాల‌న్న ధ్యేయంతో ఒక స‌మ్మిళిత రాజ్యాంగానికి రూపకల్పన చేశారని శ్రీ మోదీ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు.  ఒక దేశాన్ని నిర్మించ‌డం కోసం ప్ర‌స్తుతం భార‌తీయులు ఏకమవుతున్నార‌ని ఆయ‌న చెప్పారు.  వివిధ రంగాల‌లో అభివృద్ధి వేగంగా చోటు చేసుకుంటోంద‌ని ఆయన చెబుతూ, మ‌రుగుదొడ్ల నిర్మాణం, ప‌ల్లెల‌కు విద్యుత్తు సౌక‌ర్యం కల్పన, ఎల్‌పిజి గ్యాస్ క‌నెక్ష‌న్ లు, గృహ నిర్మాణం త‌దిత‌ర ఉదాహరణలను గురించి వివరించారు.

ఒక ర్యాంకు - ఒక పెన్ష‌న్, జిఎస్‌టి, రైతుల‌కు అధిక ఎంఎస్‌పి లు స‌హా చాలా కాలంగా ప‌రిష్కారం కాకుండా మిగిలివున్న నిర్ణ‌యాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొన్నట్లు ఆయ‌న తెలిపారు.  కేంద్ర ప్ర‌భుత్వం దేశ హితాన్ని స‌ర్వోన్న‌తంగా ప‌రిగ‌ణించినందువ‌ల్ల‌నే ఇది సాధ్య‌ప‌డిందని ఆయ‌న అన్నారు.

2013వ సంవ‌త్స‌రం తో పోలిస్తే భార‌త‌దేశాన్ని అంత‌ర్జాతీయ సంస్థ‌లు మ‌రియు ఏజెన్సీలు ప్ర‌స్తుతం ఎంతో భిన్నంగా ఏ విధంగా చూస్తున్నాయో ప్ర‌ధాన మంత్రి విపులీక‌రించారు.  “విధాన‌ప‌రమైన ప‌క్ష‌వాతం” ద‌శ నుండి “సంస్క‌రించు, ప‌ని చేయు, ప‌రివ‌ర్త‌న‌ను క‌లిగించు ” అనే ద‌శ‌కు భార‌త‌దేశం చేరుకొంద‌ని ఆయ‌న అన్నారు.  భార‌త‌దేశం ప్ర‌స్తుతం బ‌హుళ దేశాల‌కు స‌భ్య‌త్వం ఉన్న‌టువంటి అనేక ప్రముఖ సంస్థ‌ల‌లో స్థానాన్ని సంపాదించుకొంద‌ని, అంతేకాకుండా అంత‌ర్జాతీయ సౌర కూట‌మి కి నాయ‌క‌త్వం వ‌హిస్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

క్రీడ‌ ల‌లో విజ‌యాల‌ను న‌మోదు చేయ‌డం తో పాటు విద్యుత్తు కు ఆమ‌డ దూరంలో నిల‌చిన క‌డ‌ప‌టి గ్రామాల‌ను సైతం సంధానించ‌డం, ఇంకా సేంద్రియ వ్య‌వ‌సాయానికి కేంద్రం గా మారడంతో దేశం లోని ఈశాన్య ప్రాంతాలు ప్రస్తుతం వార్త‌ల లోకి ఎక్కాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ముద్ర యోజ‌న లో భాగంగా 13 కోట్ల రుణాల‌ను అందించ‌డ‌మైంద‌ని, మ‌రి  ఈ రుణాల‌లో 4 కోట్ల రుణాల‌ను- ఈ త‌ర‌హా అప్పుల‌ను తొలి సారిగా పొందుతున్న ల‌బ్దిదారుల‌కు- అందించ‌డం జ‌రిగింద‌ంటూ ప్ర‌ధాన మంత్రి విశ‌దీక‌రించారు.

భార‌త‌దేశం త‌న శాస్త్రవేత్త‌ల‌ను చూసుకొని గ‌ర్విస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  భార‌త‌దేశం 2022వ సంవ‌త్స‌రానిక‌ల్లా త‌న స్వీయ శ‌క్తి యుక్తుల‌ను ఉప‌యోగించుకొంటూ మాన‌వ‌ స‌హిత రోద‌సి యాత్ర- “గ‌గ‌న్‌-యాన్‌”- ను చేప‌డుతుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.  ఇటువంటి ప‌ని ని చేపట్టే నాలుగో దేశం గా భార‌త‌దేశం పేరు తెచ్చుకోనుంద‌ని ఆయ‌న తెలిపారు.

2022వ సంవ‌త్స‌రానిక‌ల్లా రైతుల ఆదాయాల‌ను రెట్టింపు చేయగలమన్న దార్శనికతను ప్ర‌ధాన మంత్రి పున‌రుద్ఘాటిస్తూ అత్యంత క్లిష్ట‌మైన ప‌నుల‌ను కూడా చేసి చూపాల‌న్న‌దే ధ్యేయ‌మ‌ని నొక్కిపలికారు.  ఉజ్జ్వ‌ల యోజ‌న, ఇంకా సౌభాగ్య యోజ‌న‌ ల వంటి కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల‌కు గౌర‌వాన్ని అందిస్తున్నాయని ఆయ‌న వివ‌రించారు.  స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ లో చోటు చేసుకొన్న పురోగ‌తి ని డ‌బ్ల్యుహెచ్ఒ వంటి సంస్థ‌లు ప్ర‌శంసించాయ‌ని ఆయ‌న చెప్పారు.

పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి జయంతి కి – ఈ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ నాడు – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య అభియాన్ ప్రారంభం కానుందని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.  భారతదేశంలో పేద ప్రజలకు మంచి నాణ్యత కలిగిన, తక్కువ ఖర్చుతో కూడినటువంటి ఆరోగ్య సంరక్షణ సేవ లభించేటట్లు శ్రద్ధ తీసుకోవలసిన సమయం ఆసన్నం అయిందని ఆయన స్పష్టంచేశారు.  ఈ పథకం 50 కోట్ల మంది ప్రజలపై సకారాత్మకమైనటువంటి ప్రభావాన్ని ప్రసరింపచేయగలుగుతుందని ఆయన తెలిపారు.

దాదాపు ఆరు కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను ఏరివేయడంతో ప్రభుత్వ ప్రయోజనాలు ఏ విధంగా లక్షిత వర్గాలకు చేరుతోందీ ప్రధాన మంత్రి విపులీకరించారు.  భారతదేశంలో నిజాయతీ గా పన్ను చెల్లించే వ్యక్తి దేశ ప్రగతిలో ఒక ప్రధానమైన పాత్రను కలిగివుంటాడని ఆయన చెప్పారు. అటువంటి వారి వల్లనే ఎంతో మంది కి పోషణ లభిస్తోందని, పేదల జీవితాలు పరివర్తనకు లోనవుతున్నాయని కూడా ఆయన వివరించారు. 

అవినీతిపరులను, నల్లధనం కలిగిన వారిని క్షమించేది లేదని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.  ఢిల్లీ వీధులు ఇప్పుడు అధికార దళారుల బారి నుండి విముక్తం అయ్యాయని, పేదల వాణి వినపడుతోందని ఆయన చెప్పారు.

భారతీయ సాయుధ దళాలలో స్వల్ప కాల ప్రాతిపదికన నియుక్తులైనటువంటి మహిళా అధికారులు ఇక పారదర్శకతతో కూడిన ఎంపిక ప్రక్రియ ద్వారా శాశ్వత ప్రాతిపదికన నియుక్తికి అర్హతను పొందగలరని ప్రధాన మంత్రి ప్రకటించారు. 

మూడు సార్లు తలాక్ అనేది ముస్లిమ్ మహిళల పట్ల తీరని అన్యాయానికి కారణమైందని ప్రధాన మంత్రి చెప్తూ వారికి న్యాయం జరిగేలా తాను శ్రద్ధ వహిస్తానని ముస్లిమ్ మహిళలకు ఆయన హామీని ఇచ్చారు.

దేశంలో వామ పక్ష తీవ్రవాదం తగ్గుముఖం పట్టడాన్ని గురించి ప్రధాన మంత్రి వివరించారు.  జమ్ము & కశ్మీర్ రాష్ట్రం విషయంలో పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్ పేయీ రూపకల్పన చేసిన ‘‘ఇన్సానియత్, జమూరియత్, కశ్మీరియత్’’ ను ఆయన పునరుద్ఘాటించారు. 

అందరికీ గృహ‌ వసతి కల్పన, అందరికీ విద్యుత్తు, అందరికీ శుభ్రమైన వంట ఏర్పాటు, అందరికీ నీటి సరఫరా సౌకర్యం, అందరికీ పారిశుధ్య వసతి కల్పన, అందరికీ నైపుణ్య కల్పన, అందరికీ ఆరోగ్య సౌకర్యం కల్పన, అందరికీ బీమా రక్షణ, అందరికీ సంధాన కల్పన జరగాల్సివుందని ఆయన స్పష్టంచేశారు. 

భారతదేశం పురోగమించడాన్ని, పౌష్టికాహార లోపం సమస్య అంతం కావడాన్ని, అలాగే భారతీయులు ఉత్తమ నాణ్యత కలిగిన జీవనం గడపాలని చూడడం కోసం నేను అవిశ్రాంతం గా, ఆతురత తో, ఉత్సుకత తో ఉన్నానని ఆయన అన్నారు.


**